National Youth Day 2024: తాను ఎప్పుడు చనిపోతానో స్వామి వివేకానందకు ముందే తెలుసా?
National Youth Day: భారతదేశ ఔన్నత్యం, తత్త్వచింతన, ఆధ్యాత్మిక విలువలు, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. కోట్లాది మంది యువత ఆయనను ఆదర్శంగా భావిస్తారు.
Swami Vivekananda Jayanti: భారతదేశ ఔన్నత్యం, తత్త్వచింతన, ఆధ్యాత్మిక విలువలు, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు (Swami Vivekananda). కోట్లాది మంది యువత ఆయనను ఆదర్శంగా భావిస్తారు. ఆయన ప్రసంగాలు, జీవితం, ఆలోచనలు యువతలో చైతన్యం నింపుతాయి. ఆయన సేవలకు గుర్తుగా ఆయన పట్టిన రోజు జనవరి 12ను దేశంలో జాతీయ యువజన దినోత్సవం (National Youth Day)గా జరుపుకుంటారు. ఆధ్యాత్మిక గురువు, యోగా, వేదాంతం, భారతీయ తత్వశాస్త్రాలను పాశ్చాత్య దేశాలకు అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద జయంతిని భారత ప్రభుత్వం యువజన దినోత్సవంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా మహారాష్ట్రలోని నాసిక్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజనోత్సవాలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
వివేకానందకు ఆ పేరు ఎలా వచ్చింది?
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. కానీ తన పేరును వివిదిశానంద అని చెప్పుకునేవారు. ఆ సమయంలో ఆయనకు రాజస్థాన్‌లోని ఖేత్రికి చెందిన రాజా అజిత్ సింగ్ పరిచయమయ్యారు. ఆయన నరేంద్ర నాథ్ దత్తా జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నరేంద్ర నాథ్ దత్తా పేరును వివేకానందగా మార్చేశారు. ఆ పేరు జ్ఞానం, ఆధ్యాత్మిక పరాక్రమాన్ని సూచిస్తుందని చెప్పారు. ఆ రోజు నుంచి స్వామీజీ తన పేరును వివేకానందగా మార్చుకున్నారు. అలాగే ముంబై నుంచి అమెరికా వెళ్లేందుకు వివేకానంద కోసం రాజా అజిత్ సింగ్ టికెట్ బుక్ చేశారు. ఆ సమయంలో రాజా అజిత్ సింగ్ సమర్పించిన రాజస్థానీ కండువా, వస్త్రం, నడుము పట్టీ ధరించారు. 1893 మే 31న స్వామీజీ ఓడలో చికాగోకు బయలుదేరారు.
ఆయన ఎక్కడ చదువుకున్నారు?
స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలోని కాయస్థ కుటుంబంలో జన్మించారు. అతని చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్. స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ్ దత్ కలకత్తా హైకోర్టు న్యాయవాది కాగా, తల్లి భువనేశ్వరి దేవి మతపరమైన ఆలోచనలు కలిగిన మహిళ. స్వామి వివేకానందకు చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉండేది. 1871లో 8 సంవత్సరాల వయస్సులో పాఠశాలకు వెళ్లిన తర్వాత, 1879లో ప్రెసిడెన్సీ కళాశాల ప్రవేశ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచాడు. రామకృష్ణ పరమహంస స్ఫూర్తితో స్వామి వివేకానంద, సర్వస్వం వదిలి కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే సన్యాసిగా మారారు.
రామకృష్ణ పరమహంసతో సమావేశం
కలకత్తాలోని దక్షిణేశ్వర్‌లోని కాళీ దేవాలయంలో 1881లో రామకృష్ణ పరమహంసను వివేకానంద మొదటిసారి యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. ట్రాన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాడానికి రామకృష్ణ పరమహంసను కలుసుకోవాలని తన సాహిత్య ప్రొఫెసర్ సూచించగా.. అలా పరమహంసను వివేకానంద స్వామి మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంసను స్వామి వివేకానంద ‘మీరు దేవుడిని చూశారా?’ అని ప్రశ్నలు అడిగేవారు. పరమహంస సమాధానమిస్తూ.. ‘అవును నేను చూశాను, నేను నిన్ను చూడగలిగినంత స్పష్టంగా భగవంతుడిని చూస్తున్నాను’ అంటూ సమాధానమిచ్చారు.
ప్రపంచాన్ని కదిలించిన ప్రసంగం
చికాగోలో 1893 సంవత్సరం సెప్టెంబర్ 11 న ప్రపంచ సర్వ మత సదస్సు తేదీన ప్రారంభమైంది. వేదికపై స్వామీజీ గంభీరమైన గొంతుతో 'అమెరికా సోదర సోదరీమణులు' అంటూ స్వామి వివేకానంద ప్రసంగం ప్రారంభించారు. ఆ పిలుపునకు సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి కొన్ని నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరు "లేడీస్ అండ్ జెంటిల్ మెన్" అంటూ స్పీచ్ మొదలు పెట్టారు. కానీ వివేకానంద సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వారి హృదయాలను తాకింది.
ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్లంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఏ పేపర్ చూసినా ఆయన గురించే
సభ తరువాత రోజు చికాగో లో వార్త పత్రికల్లాంటిలోను ఫ్రంట్ పేజీలో స్వామిజి ఫోటోలే, ఆయన ప్రసంగాన్నే ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్లు కూడా కీర్తిస్తూ రాశాయి. ఒక చికాగో పత్రిక అయితే ‘ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం’ అని వ్యాఖ్యానించింది. ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారు మోగిపోయింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా.
అప్పటి వరకు భారత దేశం అంటే, మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ భారత దేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేశారు. భారత దేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వ మత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతి రోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామిజి స్పీచ్ ముందే పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్లిపోయేవారు.
రామకృష్ణ మఠం ఏర్పాటు
చికాగో పర్యటన అనంతరం స్వామి వివేకానంద చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేశారు. కలకత్తాలో 1 మే 1897న రామకృష్ణ మిషన్‌ను, 9 డిసెంబర్ 1898న గంగా నది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడంతో ఆయన ఆరోగ్యం దెబ్బంది. ఒకరోజు స్వామిజీ ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగ తీసుకురమ్మన్నారు. దానిలో జులై 4 తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్క్ చేశారు. కానీ అది దేనికో ఆ శిష్యులకు అర్ధం కాలేదు.
ఆ రోజు రానే వచ్చింది 1902 సంవత్సరం జులై 4 తేదీన రాత్రి 9 గంటల సమయంలో కొంత సేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని తుది శ్వాస విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన. బేలూరులోని గంగానది ఒడ్డున స్వామి వివేకానంద అంత్యక్రియలు జరిగాయి. అదే గంగా తీరానికి అవతలివైపు, ఆయన గురువు రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగాయి.