SC orders to AAP: ఢిల్లీలోని ఆఫీసును ఖాళీ చేయండి- ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. జూన్ 15 వరకు గడువు విధించింది.
Supreme Court orders to AAP: కేజ్రీవాల్ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఆప్ కార్యక్రమంలో ఉన్న స్థలం ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలమని పేర్కొంది సుప్రీం కోర్టు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే.. లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున... కొంత సమయం ఇచ్చింది. జూన్ 15లోగా స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.
జిల్లా కోర్టును విస్తరించేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కు ఆ స్థలాన్ని కేటాయించారని... ఆ స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఉన్నందున... ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందే అని తెలిపింది అత్యున్నత ధర్మాసనం. అయితే... ఆప్ కార్యాలయం కోసం కావాల్సిన భూమిని కేటాయించేందుకు... ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను సంప్రదించాలని సూచించింది సుప్రీం కోర్టు. పార్టీ అభ్యర్థనను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ఆదేశించింది. నిర్ణీత సమయంలోగా తన నిర్ణయాన్ని తెలియజేయాలని కూడా డిపార్ట్‌మెంట్‌ని కోరింది.
రౌస్ అవెన్యూ కోర్టుకు సమీపంలో... ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆప్ కార్యాలయం ఉన్న విషయాన్ని సుప్రీం పరిశీలించింది. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని, ఒక రాజకీయ పార్టీ అక్కడ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తుందని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. కోర్టు విస్తరణకు కేటాయించిన స్థలంలోని అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలోగా ఢిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమావేశం కావాలని ఆదేశించింది. మరోవైపు... ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తమ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మానం నిర్మాణం కాదని వాదించింది. కోర్టు విస్తరణ కోసం కేటాయించబడటానికి చాలా కాలం ముందే.. ఆ స్థలం పార్టీ ఆఫీసుకు కేటాయించబడిందని వాదించింది.
ఆప్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ... వాదనలు వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన ఆ స్థలాన్ని 1993 నుంచి 2015 మధ్యకాలంలో ఎన్‌సీటీ (NCT) వినియోగించుకుందని తెలిపారు. అంతేకాదు.. భారతదేశంలోని 6 జాతీయ పార్టీలలో ఆప్ ఒకటని ఆయన అన్నారు. అదే ప్రాంతంలో... బీజేపీకి కూడా కార్యాలయం ఉందని ఏఎం సింఘ్వీ చెప్పారు. ఎన్నికలకు రెండు నెలల ముందు... ఈ విషయాన్ని బయటకు లాగి రాద్దాంతం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో తమ కార్యాలయాన్ని నిర్మించాలని ఆప్‌ని కోరినట్లు సింఘ్వీ తెలిపారు. అదే ప్రాంతంలో ఎల్‌ఎన్‌డిఓ (LNDO) కి చెందిన రెండు ప్లాట్లు ఉన్నాయని.. వాటిని ఆప్‌కి కేటాయించాలని కోరారు. బదర్‌పూర్‌కు వెళ్లాలని ఆప్‌ని కోరితే, మిగతా పార్టీలన్నీ కూడా అలాగే చేయాలన్నారు సింఘ్వీ. కనీసం సెంట్రల్ ఢిల్లీలోనైనా పార్టీకి చోటు దక్కాలన్నారు. ఆప్ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్... ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు జూన్ 15వరకు గడువు ఇచ్చారు.