Chandigarh Mayor: బీజేపీ నేతకు సుప్రీంకోర్టు షాక్, చండీగఢ్ మేయర్‌గా ఆప్ నేత కుల్దీప్ కుమార్ పేరు ప్రకటన
Chandigarh Mayor News: చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అభ్యర్థి కుల్దీప్ కుమార్ పేరును సుప్రీంకోర్టు ప్రకటించింది.
SC Declares AAP Candidate Kuldeep Kumar As Validly Elected Chandigarh Mayor: ఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అభ్యర్థి కుల్దీప్ కుమార్ పేరును సుప్రీంకోర్టు ప్రకటించింది. చండీగఢ్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.
Chandigarh Mayor Election matter | Supreme Court orders that AAP candidate is declared to be the validly elected candidate for the post of Mayor of Chandigarh Municipal Corporation. pic.twitter.com/QMWkJUMij4
— ANI (@ANI) February 20, 2024
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ జెజీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం.. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో చెల్లుబాటు కాని 8 బ్యాలెట్ పత్రాలను పరిశీలించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగానే ఆప్ కౌన్సిలర్ల ఓట్లు చెల్లుబాటు కాకుండా ప్రయత్నం చేసినట్లు ధర్మాసనం గుర్తించింది. ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. చండీగఢ్ మేయర్ గా బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది.
చండీగఢ్ మేయర్ పదవికి జనవరి 30న ఎన్నికలు నిర్వహించారు. అయితే తగిన సభ్యుల సంఖ్య (16) లేకున్నా బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. మెజారిటీకి కావాల్సిన కౌన్సిలర్ల సంఖ్య(20) కాగా, ఆప్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓటమి చెందారు. మెజార్టీ ఉన్నా ఆప్, కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ఓటమి చెందారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్నికల అధికారి ఆ బ్యాలెట్ పత్రాలపై ఏదో రాసి, కొన్ని ఓట్లను చెల్లకుండా చేశారని ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని, న్యాయ విచారణ చేపట్టాలని ఆప్ కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన ధర్మాసనం బీజేపీ నేత ఎన్నిక చెల్లదని, ఆప్ నేత కుల్దీప్ కుమార్ చండీగఢ్ మేయర్ అని తీర్పు వెలువరించింది.
రిటర్నింగ్ అధికారిపై సీజేఐ చమత్కారం
రిటర్నింగ్ అధికారిపై సీజేఐ చమత్కరించారు. మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాసిహ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జీవితంలో కొంచెం వినోదం అందరికీ కావాలి. మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వీడియోను ఓసారి ప్రదర్శించండి. మొత్తం వీడియో మేం చెక్ చేస్తూ కూర్చుంటే.. సాయంత్రం 5.45 వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందని’ సీజేఐ చంద్రచూడ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆప్ అభ్యర్థికి పడిన ఓట్లలో 8 ఓట్లు చెల్లలేదని వాటిని పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని చెప్పారని ఎన్నికల అధికారిని ధర్మాసనం అడిగింది. ఆ ఓట్లు ఆప్ నేతకు వచ్చాయని, వాటిపై కొన్ని గీతలు రాసి ఉన్నట్లు తెలిపారు. ఇరుపక్షాల న్యాయవాదులకు కోర్టులో ఆ పేపర్లను చూపించారు. అంతా చెక్ చేసిన తరువాత ఓట్లు లెక్కింపు చేపట్టి ఆప్ అభ్యర్థిని మేయర్ గా ప్రకటించారు.