Supreme Court: బుల్డోజర్ జస్టిస్ సరికాదు- నిందితుల ఇళ్లు కూల్చడంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
Supreme Court Comments: నిందితులపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుండానే వారి ఆస్తుల ధ్వంసం, ఇళ్ల కూల్చివేతను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
Supreme Court On Bulldozer Action: ఆరోపణలు వచ్చిన వెంటనే నిందితుల ఇళ్లు కూల్చివేసే బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు బుధవారం (13 నవంబర్ 2024) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయరాదని కోర్టు హెచ్చరించింది. జస్టిస్ గవాయి కవి ప్రదీప్ రాసిన కవితను ఉటంకిస్తూ ఇల్లు ఒక కల అని, అది ఎప్పటికీ విచ్ఛిన్నం కాదన్నారు. ఇంటిని కూల్చివేయడమే నేరానికి శిక్ష కాదని న్యాయమూర్తి అన్నారు.
న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘మేం అన్ని వాదనలు విన్నాం.. ప్రజాస్వామ్య సూత్రాలను పరిగణనలోకి తీసుకున్నాం. న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ, జస్టిస్ పుట్టస్వామి వంటి కేసుల్లో తీర్పులను పరిగణనలోకి తీసుకున్నాం. ప్రభుత్వం పాలన పరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ అవి చట్టానికి అతిక్రమించేలా ఉండకూడదు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. పౌర హక్కుల రక్షణ అవసరం." అని కామెంట్ చేశారు.
నిందితులకు కూడా రాజ్యాంగ హక్కులు
ఎంతటి నేరారోపణలు ఉన్న వ్యక్తులకైనా రాజ్యాంగం హక్కులు కల్పించిందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తమ హక్కులకు భంగం వాటిల్లదని ప్రజలు గుర్తించాలని న్యాయమూర్తి అన్నారు. అందుకు ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయరాదు. మేము మార్గదర్శకాలను జారీ చేయాలా వద్దా అని మేము ఆలోచించాము. విచారణ లేకుండా ఇంటిని కూల్చివేయడం సరికాదు. దీని ద్వారా ఎవరినీ శిక్షించలేరు. పాలనా యంత్రాంగం ఇష్టారాజ్యంగా ఇళ్లు కూల్చివేస్తే అందుకు అధికారులను బాధ్యులను చేయాల్సి ఉంటుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకి కూడా రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. విచారణ లేకుండా నేరం రుజువు కాకుండా ఎవరూ దోషులు కారు." అని చెప్పుకొచ్చారు.