తమిళనాడు కర్ణాటక మధ్య ముదురుతున్న కావేరీ జల వివాదం - ఎవరి వాదన వారిదే!
Cauvery Water Dispute: తమిళనాడు, కర్ణాటక మధ్య మరోసారి కావేరీ జల వివాదం మొదలైంది.
Cauvery Water Dispute:
కావేరి జలాల వివాదం..
తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ వివాదం మరింత ముదురుతోంది. 3 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకి విడుదల చేయాలంటూ Cauvery Water Regulatory Committee (CWRC) ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. ఇదే విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. ఈ నెల 26న ఢిల్లీలో కావేరి వాటర్ రెగ్యులేటరీ కమిటీ భేటీ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం 3 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకి విడుదల చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకూ నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై కొంత మంది లాయర్స్‌తో మాట్లాడానని, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయమని సలహా ఇచ్చారని సిద్దరామయ్య స్పష్టం చేశారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
"తమిళనాడు ప్రభుత్వానికి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరి వాటర్ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాలిచ్చింది. దీనిపై ఇప్పటికే మా న్యాయవాదులతో మాట్లాడాను. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయమని వాళ్లు సలహా ఇచ్చారు. కచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాం. తమిళనాడుకి విడుదల చేసేందుకు మా వద్ద నీళ్లు లేవు. ఈ ఆదేశాలను కోర్టులో సవాల్ చేయనున్నాం. 194 తాలూకాలు కరవుతో అల్లాడుతున్నాయి. అక్కడ వానలు కురవాలని మహదేశ్వర ఆలయంలో ఎన్నో సార్లు పూజలు చేశాను"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
ఇక దీనిపై రాజకీయాలూ మొదలయ్యాయి. సిద్దరామయ్య,డీకే శివకుమార్ తమిళనాడు ప్రభుత్వ ఏజెంట్‌లుగా పని చేస్తున్నారని బీజేపీ, జేడీఎస్ విమర్శలు చేస్తున్నాయి. తమిళనాడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తున్నాయి.
"సిద్దరామయ్య, శివకుమార్ తమిళనాడు ఏజెంట్‌లుగా పని చేయడం మానుకోవాలి. అసలు నిజాలేంటో తెలుసుకోవాలి. మన రాష్ట్రంలో దాదాపు అన్ని రిజర్వాయర్‌లలో తాగడానికి సరిపడా నీళ్లు లేవు"
- బీఎస్ యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి
ఏంటీ వివాదం..?
తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతోంది. 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకకు అదనంగా 14.75 TMCల నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు వాటాని అదే స్థాయిలో తగ్గించింది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక రీసోర్స్ ఈ కావేరి నదీ జలాలే. అంతే కాదు. కర్ణాటకలోని మాండ్యలో వ్యవసాయ భూములకూ ఈ నీరే ఆధారం. అయితే...దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇది బయటపడింది. ఇక్కడ రాష్ట్రాల వాదన ఏంటంటే...2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్పనిసరే. కానీ...ఇది సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది వర్షపాతం 30% మేర తక్కువగా నమోదైంది. అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలంటే ఎలా అని కర్ణాటక వాదిస్తోంది. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: నేనో సీనియర్ లీడర్‌ని, చేతులు జోడించి ఓట్లు అడుక్కోవాలా - బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు