ఒడిశాలో వణుకు పుట్టిస్తున్న స్క్రబ్ ఇన్‌ఫెక్షన్, ఆరుగురు మృతి - ప్రభుత్వం అలెర్ట్
Scrub Typhus: ఒడిషాలో స్క్రబ్ వైరస్ సోకి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Scrub Typhus:
స్క్రబ్ ఇన్‌ఫెక్షన్
కేరళలో నిఫా వైరస్ ఆరుగురి ప్రాణాల్ని బలి తీసుకుంది. క్రమంగా అక్కడ వ్యాప్తి పెరుగుతోంది. పలు చోట్ల కరోనా తరహా ఆంక్షలు విధిస్తున్నారు. కంటెయిన్మెంట్ జోన్‌లూ ప్రకటించారు. ఈ వైరస్‌తోనే సతమతం అవుతుంటే ఇప్పుడు మరో కొత్త వైరస్ కలవర పెడుతోంది. ఒడిశాలో బర్‌గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ ఇన్‌ఫెక్షన్‌తో ( Scrub Typhus Infections) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బర్‌గఢ్ జిల్లాలో ఐదుగురు, సుందేర్‌గఢ్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ సుందేర్‌గఢ్ జిల్లాలో 132 మందికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకింది. వీరిలో దాదాపు అందరూ కోలుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి మాత్రం చనిపోయినట్టు వివరించారు.
"ఈ ఏడాది జనవరి నుంచి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 132 కేసులు నమోదు కాగా...వీరిలో అందరూ కోలుకున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఆరు మరణాల్లో ఐదుగురు గతంలోనే ప్రాణాలు కోల్పోగా..ఇటీవలే ఓ వ్యక్తి చనిపోయాడు. ఓ ప్రైవేట్ క్లినిక్‌లో టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయాడు"
- వైద్యాధికారులు
అలెర్ట్ అయిన ప్రభుత్వం..
ఈ మరణాలతో ఒక్కసారిగా ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సీజనల్ వ్యాధిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల ఈ కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తుగానే ఈ కేసులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని తేల్చి చెప్పింది. సరైన సయమానికి చికిత్స అందేలా చూడడం అందరి బాధ్యత అని స్పష్టం చేసింది.
"ఈ ఇన్‌ఫెక్షన్లను కట్టడి చేయడంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. టెస్ట్ కిట్‌లు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజల్లోనూ అవగాహన కల్పించి ముందస్తుగానే ఈ కేసులను గుర్తించాలి. నిఘాను మరింత పెంచాలి. అన్ని ఆసుపత్రుల్లోనూ సరిపడ మందులు, యాంటీబయాటిక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం నమోదైన మరణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. ఇలాంటి వ్యాధులకు సంబంధించిన డేటాని కచ్చితంగా భద్రపరచాలి"
- రాష్ట్ర ఆరోగ్య శాఖ
స్క్రబ్ టైఫస్ అంటే..?
స్క్రబ్ టైఫస్‌నే బుష్ టైఫస్‌గానూ ( bush typhus) పిలుస్తారు. ఒరియెంటియా సుసుగమోషి ( Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా కారణంగా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన పురుగులు కుట్టినప్పుడు మనుషుల్లోనూ ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. అడవులు, పంట పొలాల్లో ఉన్న వాళ్లకే ఇది ఎక్కువగా సోకే అవకాశాలుంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దద్దర్లు ఈ వ్యాధి లక్షణాలు.
కేరళలో నిఫా భయం
మొన్నటి వరకూ కరోనా భయంతో వణికిపోయాయి ప్రపంచ దేశాలు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ఎక్కడో ఓ చోట తప్ప కేసులు నమోదు కావడం లేదు. ముఖ్యంగా భారత్‌లో కేసులు తగ్గిపోయాయి. ఊపిరి పీల్చుకునే లోపే ఇప్పుడు మరో వైరస్ వెంటాడుతోంది. వైరస్‌లకు హబ్‌గా మారిపోయిన కేరళలో మరోసారి నిఫా వైరస్ (Nipah Virus) వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కొజికోడ్‌లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ పరిసర ప్రాంతాల్లో కంటెయిన్మెంట్ జోన్‌లను ప్రకటించింది ప్రభుత్వం. నిఫా టెస్ట్‌ల కోసం ప్రత్యేకంగా మొబైల్ వెహికిల్‌నీ ఏర్పాటు చేసింది. కర్ణాటక, రాజస్థాన్ అప్రమత్తమయ్యాయి. ఎవరూ కేరళకు వెళ్లొద్దని ఆదేశించాయి.
Also Read: Sanatana Dharma Row: I.N.D.I.A కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శనాస్త్రాలు