Russia-Ukraine War: ఖార్ఖీవ్ నుంచి భారతీయుల తరలింపు పూర్తి, మరో 24 గంటల్లో స్వదేశానికి 2,900 మంది : విదేశాంగ శాఖ
Russia-Ukraine War: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు సవాల్ గా మారిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్ లో భారతీయులను గుర్తిస్తున్నామని వీలైనంత త్వరగా అందరినీ దేశానికి తరలిస్తామని వెల్లడించారు.
Russia-Ukraine War: వచ్చే 24 గంటల్లో దాదాపు 2,900 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 24 గంటల్లో 13 విమానాలు రానున్నాయని తెలిపింది. గత 10 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా తీవ్ర సైనిక దాడి చేస్తుంది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారో ప్రభుత్వం పరిశీలిస్తుందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. "దౌత్య కార్యాలయం ఉక్రెయిన్ లో ఉన్నవారిని సంప్రదిస్తుంది. పిసోచిన్‌లో ఉన్న 298 మంది విద్యార్థులను తరలించాం. విద్యార్థుల తరలింపు త్వరగా పూర్తి చేయాలని ఆశిస్తున్నాం" అని బాగ్చీ చెప్పారు.
ఖార్ఖీవ్ లో భారతీయులు ఎవరూ లేరు
ఉక్రెయిన్‌లోని పిసోచిన్, ఖార్కివ్ నుంచి ప్రతి ఒక్కరినీ రాబోయే కొద్ది గంటల్లో పూర్తిగా తరలిస్తామని విదేశాంగ అధికారులు తెలిపారు. ఇక ఖార్ఖీవ్‌లో భారతీయులు ఎవరూ మిగిలిపోలేదని కూడా చెప్పారు. దాడుల కారణంగా తరలింపు సవాల్ గా మారిందని అధికారులు అంటున్నారు. సుమీ ప్రాంతంలోని భారతీయులను తరలిస్తున్నామని తెలిపారు. "భారత పౌరులను తరలించడానికి కాల్పుల విరమణే ఉత్తమం" అని బాగ్చి చెప్పారు. ఒక నేపాలీ పౌరుడు, బంగ్లాదేశ్ జాతీయుడు భారతీయ విమానంలో వస్తారని బాగ్చి అన్నారు.
6,222 మంది తరలింపు
'ఆపరేషన్ గంగ' ద్వారా గత ఏడు రోజుల్లో రొమేనియా, మోల్డోవా నుండి దాదాపు 6,222 మంది భారతీయ పౌరులు స్వదేశానికి తీసుకొచ్చామని విదేశాంగ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 2,000 మంది భారతీయ పౌరులను 'ఆపరేషన్ గంగ' కింద తరలించే అవకాశం ఉందన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, స్లోవేకియా, పోలాండ్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 629 మంది శనివారం ఉదయం దేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ గంగలో భాగంగా భారత వాయుసేన (IAF) కు చెందిన విమానాలు రొమేనియా, స్లొవేకియా, పోలండ్ నుంచి 629 మందిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్ విమాన స్థావరానికి తరలించాయి. భారత్ నుంచి వెళ్లేటప్పుడు విమానాలు సహాయక చర్యలకు సంబంధించిన 16.5 టన్నుల సామాగ్రిని తీసుకెళ్లాయి.
ఇంకా 2000-3000 మంది భారతీయులు
ఆపరేషన్ గంగ (Operation Ganga) లో భాగంగా ఇప్పటి వరకు భారత వాయుసేన విమానాలు మొత్తం 2,056 మందిని సురక్షితంగా దేశానికి తీసుకొచ్చాయి. సీ-17 భారీ ప్రయాణ వాహనాన్ని దీనికి వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2000-3000 మంది భారతీయులు ఉక్రెయిన్ (Ukraine)లో ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. మరోవైపు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో ఇంకా 1000 మంది భారతీయులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వారందరినీ సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది.