జయలలిత మరణం మిస్టరీ గుట్టు రట్టు - సీక్రెట్ రిపోర్ట్ స్టాలిన్ చేతికి !
జయలిత మరణంపై స్టాలిన్ కు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణ కమిటీ నివేదిక సమర్పించారు. ఈ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలా లేదా అన్నది ఇంకా స్టాలిన్ సర్కార్ నిర్ణయించుకోలేదు.
Jayalalita : తమిలనాడు మాజీ సీఎం జలలలిత మరణంపై మిస్టరీ వీడిపోయింది. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి అరుముఘస్వామి కమిషన్ తన రిపోర్ట్‌ను సమర్పించింది. 590 పేజీలతో తయారైన ఆ నివేదికను ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌కు అందజేశారు. జయ మృతిచెందిన అయిదేళ్ల తర్వాత ఆమె మృతి రిపోర్ట్‌ను పూర్తి చేశారు. గతంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం జయ మరణంపై అరుముఘస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2017, నవంబర్ 22న ఆ కమిషన్ దర్యాప్తును ప్రారంభించింది.
స్టాలిన్‌కు రిపోర్టు ఇచ్చిన జస్టిస్ అరుమురుగస్వామి కమిషన్
జస్టిస్ అరుమురుగస్వామి మద్రాసు హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. జయ మృతికి దారితీసిన కారణాలను కమిషన్ తన రిపోర్ట్‌లో పొందుపరిచింది. విచారణలో భాగంగా అరుముఘస్వామి కమిషన్ సుమారు రెండు వందల మందిని ప్రశ్నించింది. 158 మంది సాక్ష్యులను, పిటిషీనర్లను విచారించినట్లు అరుముగస్వామి తెలిపారు. విచారణను సాగదీసినట్లు కొందరు తనపై ఆరోపణలు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే తాను చేపట్టిన దర్యాప్తు నివేదికను రిలీజ్ చేయాలా వద్దా అన్న అంశాన్ని ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. విచారణ సమయంలో అపోలో హాస్పిటల్, శశికళ సహకరించినట్లు రిటైర్డ్ జడ్జి ప్రకటించారు.
70 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చనిపోయిన జయలలిత
2016లో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత హఠాత్తుగా అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలో అనారోగ్యంతో పోరాడిన జయలలిత డిసెంబర్లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తమ ఆరాధ్య నేత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. అదే సమయంలో 70 రోజుల పాటు చికిత్స తీసుకున్నా జయలలిత ఎందుకు కోలుకోలేదని, ఆమెను విదేశాలకు ఎందుకు తరలించి చికిత్స అందించలేకపోయారని, అపోలో ఆస్పత్రి ఏదో దాస్తోందన్న ఆనుమానాలు మాత్రం జనాన్నివీడలేదు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వాలపై ఈ మిస్టరీని ఛేదించాలన్న ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో జయ మరణం తర్వాత అన్నాడీఎంకే నేత పన్వీర్ సెల్వం కోరికపై సీఎం పళనిస్వామి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు.
జయలలిత మరణంపై ఎన్నో సందేహాలు
జయ మరణం తర్వాత ఈ ఆరేళ్లలో ఎన్నో వైద్య నివేదికలు ఆమెకు అందిన చికిత్సపై అధ్యయన వివరాలు వెల్లడించాయి. అపోలో ఆస్పత్రి కూడా పలుమార్లు జయకు తాము అందించిన వైద్యం వివరాలను బయటపెట్టింది. అయినా జనంలో అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా అప్పట్లో జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళ చివరి రోజుల్లో ఆమె వద్దకు ఎవరినీ అనుమతించలేదన్న ప్రచారం జనంలో అనుమానపు బీజాల్ని నాటేసింది. దీంతో ఆ తర్వాత ఆర్ముగస్వామి కమిషన్ కు ఎయిమ్స్ డాక్టర్లు అందించిన నివేదికలో మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. అయితే అసలు మొత్తం మరణంపై మాజీ న్యాయమూర్తి కమిటీ రిపోర్టుతో తేలిపోనుంది. ప్రభుత్వం విడుదల చేసే రిపోర్టు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.