Monsoon Session: మణిపూర్ సమస్యపై చర్చకు సిద్ధం - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్రం ప్రకటన
Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ప్రకటించింది.
Monsoon Session: రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించేందుకు సిద్ధమని కేంద్ర బుధవారం ప్రకటించింది. వర్షాకాల సమావేశాల కోసం వివిధ అంశాలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాన్‌సూన్ సెషన్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదించిన ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, మణిపూర్ లో జరిగిన హింసాకాండపై చర్చించానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జోషి నొక్కి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.
కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, అనుప్రియ పటేల్(అప్నాదళ్), రాంగోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), తంబి దురై(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం), ఎస్టీ హసన్(ఎస్పీ), కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్‌నాథ్ సింగ్, ఏడీ సింగ్(రాష్ట్రీయ జనతా దళ్), ఎన్‌కే ప్రేమ్‌చంద్ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) సహా వివిధ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
శనివరం సోనియా గాంధీ నివాసంలో జరిగిన పార్లమెంటరీ వ్యూహ భేటీలో వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ అంశంపై చర్చ చాలా ముఖ్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ శనివారం మీడియా సమావేశంలోనూ నొక్కి చెప్పారు. మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి మాట్లాడాలని, ప్రధానమంత్రి సమక్షంలో చర్చ జరగాలని జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ లో ఏం జరిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏం చేయనున్నాయో.. ప్రధాని ఎంపీలకు తెలియజేయాలని జైరామ్ రమేష్ అన్నారు.. బ్రేక్ ది సైలెన్స్ అని వ్యాఖ్యానించారు.
మే 3 నుంచి మణిపూర్ లో హింసాకాండ
ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3వ తేదీన ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తెగదల మధ్య వైరం మొదలైంది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికార లెక్కల ప్రకారమే 140 మంది వరకు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 165 కాలమ్‌లు (ఒక్కొక్కటి 35-40 మంది సిబ్బంది) మణిపూర్ రాష్ట్రంలో మోహరించారు. అదనంగా 57 కంపెనీలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 48 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నాలుగు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ రాష్ట్రంలో మోహరించారు. ఒక్కో కంపెనీలో దాదాపు 100 మంది సిబ్బంది ఉంటారు.