Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఢిల్లీలో కొత్త ఇల్లు ఖరారు, ఇక ప్రతిపక్ష నేతకు అడ్రస్ ఛేంజ్!
Rahul Gandhi New Address: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్. 5ను కేటాయించనుంది.
Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికారిక నివాసం మారింది. ఢిల్లీలోని సున్‌హారీ బాగ్ రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాను ప్రభుత్వం రాహుల్ గాంధీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే రాహుల్ కొత్త చిరునామా కానుంది. ఈ మేరకు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరీ ఈ బంగ్లాను రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈసారి ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
అది క్యాబినెట్ ర్యాంకు హోదా కావడంతో టైప్ 8 బంగ్లాను పొందేందుకు రాహుల్ గాంధీ అర్హులు. టైప్ 8 బంగ్లాను క్యాబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు. ఈ టైప్ 8 బంగ్లాకు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారిక కేటాయింపు, బంగ్లా రెనోవేషన్ తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడికి మారనున్నారు. ప్రతిపక్ష నేతగా, రాహుల్ కేంద్ర మంత్రి హోదా ప్రకారం టైప్ 8 బంగ్లాను పొందవచ్చు.
ప్రస్తుతం 10 జనపథ్‌లో ఉంటున్న రాహుల్
ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి 10 జన్‌పథ్‌లో నివసిస్తున్నారు. అయితే దీనికి ముందు, 2004 నుండి ఏప్రిల్ 2023 వరకు రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్ 12 లో నివసించారు. లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్-12లో తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. జన్‌పథ్‌లోని తన తల్లి సోనియాగాంధీ ఇంటికి రాహుల్ షిప్ట్ అయ్యారు. నివాసాన్ని ఖాళీ చేయడానికి ముందు రాహుల్ తన సామాన్లను రెండు ట్రక్కుల్లో అక్కడికి షిఫ్ట్ చేశారు. ఐదేళ్ల కిందట కర్ణాటక కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు .. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా రాహుల్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది.
నా ఇల్లు భారత దేశం : రాహుల్
గత ఏడాది పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందిన తర్వాత, లోక్‌సభ హౌసింగ్ కమిటీ తుగ్లక్ లేన్‌లోని బంగ్లాను రాహుల్ గాంధీకి కేటాయించింది. కానీ ఆయన నా ఇల్లు భారతదేశం అని వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఎనిమిది రకాల ప్రభుత్వ గృహాలు కేటాయించారు. కేంద్ర మంత్రులకు టైప్-8 వసతి లభిస్తుంది, ఇది అతిపెద్ద కేటగిరీ కింద వస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు టైప్-5, టైప్-6 నివాసాలు కేటాయిస్తారు. మిగిలిన కేటగిరీల నివాసాలు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తారు.