
Rahul Denied entry into temple: గుడిలోకి వెళ్లకుండా రాహుల్ అడ్డగింత.. గుడిముందే ధర్నా
Bharath Jodo Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీకి చేదు అనుభవం ఎదురైంది.

Bharath Jodo Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. అసోంలోని బటద్రవ ఆలయానికి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి టెంపుల్ కమిటీ అనుమతి నిరాకరించారు. ఆయన్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం బటద్రవ చేరుకున్నారు. అక్కడ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనను ఆలయంలోకి అనుమతించకపోవడంతో.. రాహుల్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆలయ దర్శనం కోసం ప్రయత్నించగా.. కమిటీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు శ్రీమంట శంకరదేవ జన్మస్థలంలో నిర్మించిన ఆలయమే బటద్రవ.
గుడిలోకి అనుమతించకుండా అడ్డుకేనేంత తప్పు తాను ఏం చేశానో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆలయంలో గొడవలు సృష్టించడం తమ ఉద్దేశం కాదని, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతానని అన్నారు. అయినా అనుమతించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తనను లోపలికి అనుమతించ వద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే ఆలయ కమిటీ అడ్డుకుందని విమర్శించారు. ఆలయంలోకి ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదు? అనేది కూడా దేశ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. కాగా.. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తామని పోలీసులు రాహుల్‌కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై కూర్చున్న రాహుల్ వాళ్లతో కలిసి పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు.
అయోధ్య రామందిరం ప్రతిష్ఠాపన నేపథ్యంలో గొడవలు చలరేగే అవకాశం ఉన్నందున దర్శనానికి వెళ్లొద్దని రాహుల్‌గాంధీకి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు రాహుల్ గాంధీ బటద్రవకు వెళ్లకూడదని సూచించారు. దీనివల్ల ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ్ యాత్ర రూట్ మార్చుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా.. అస్సాంలోని 17 జిల్లాల మీదుగా భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగనుంది. 833 కి.మీ. మేర సాగే ఈ యాత్ర జనవరి 25 వరకు అస్సాంలో కొనసాగనుంది.
కాగా.. ఆదివారం జరిగిన యాత్రలో కూడా రాహుల్‌గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్‌గాంధీ బస్సులో సోనిత్‌పూర్ జిల్లా మీదుగా వెళ్తుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వాళ్లను కలుసుకునేందుకు రాహుల్ కిందకి దిగగా.. కొంతమంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోడీ, మోడీ అంటూ కేకలు పెట్టారు. దీంతో భద్రతా దళాల సూచన మేరకు బస్సులోకి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ అక్కడ నుంచి వాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

