పంజాబ్‌లోనూ తెలంగాణ సీన్, ప్రభుత్వానికి గవర్నర్‌కి విభేదాలు - రాష్ట్రపతి పాలన తప్పదా?
Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కి ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
Punjab Governor:
ముదిరిన విభేదాలు..
ప్రభుత్వానికి గవర్నర్‌కి విభేదాలు రావడం చాలా రాష్ట్రాల్లో సాధారణమైపోయింది. పాలనాధికారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వాలు విమర్శిస్తుంటే...ప్రభుత్వమే తమ అధికారాల్ని లెక్క చేయడం లేదని గవర్నర్‌లు ఆరోపిస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏకంగా రాష్ట్రపతి పాలన విధిస్తామని గవర్నర్ ప్రభుత్వాన్ని హెచ్చరించేంత వరకూ వచ్చింది గొడవ. దీనిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ (Banwarilal Purohit) ముఖ్యమంత్రికి పలు లేఖలు రాశారు. వాటికి సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సూచిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు. సీఎంపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పవని తేల్చి చెప్పారు. సాధారణంగా ఆర్టికల్ 356ని రద్దు చేస్తూ గవర్నర్ కేంద్రానికి లేఖ రాసిన వెంటనే ఆ రాష్ట్ర అధికారాలన్నీ రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లిపోతాయి.
వివాదం ఇదే..
గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పదేపదే ఒకే ప్రశ్న ప్రభుత్వానికి సంధిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని లెటర్స్ రాశారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలు, రిపోర్ట్‌లు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు బన్వరిలాల్ పురోహిత్. ఫార్మసీలు, ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న లిక్కర్ స్టోర్‌లలోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. అంతే కాదు. పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు డ్రగ్స్‌కి బానిస అయ్యారని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి పాలనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని బన్వరిలాల్ స్పష్టం చేశారు.
"ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతికి నేను లేఖ రాసే ముందు డ్రగ్స్ సరఫరాకి సంబంధించిన కీలక వివరాలు ఈ ప్రభుత్వం తెలియజేయాలి. నేను రాసిన లేఖలకు బదులివ్వాలి. రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలి. లేదంటే చట్టం, రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. IPC సెక్షన్ 124 ప్రకారం ముఖ్యమంత్రిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతాయి"
- బన్వరిలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్
అయితే...ఈ హెచ్చరికలపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గవర్నర్ కావాలనే ఇలా కుట్ర పన్నుతున్నారని, దీని వెనకాల బీజేపీ ఉందని ఆరోపిస్తున్నారు.
"ప్రజలు ఎన్నుకున్న నేతలకు రాజ్యాంగపరమైన హక్కులుంటాయి. గవర్నర్ ఇలాంటి హెచ్చరికలు చేయడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బెదిరింపుల వెనక కచ్చితంగా బీజేపీ ఉంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తే ముందుగా అది మణిపూర్, హరియాణాలో చేయాలి. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వం పని చేస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్‌లు ఇలాగే వ్యవహరిస్తున్నారు. బీజేపీ అజెండాతో ఇబ్బంది పెడుతున్నారు"
- మల్వీందర్ సింగ్ కంగ్, ఆప్ నేత