Punjab Assembly: పంజాబ్ స్పీకర్‌కు తాళం గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం- ప్రతిపక్షాలను లాక్ చేయమనడంతో సభలో గందరగోళం
పంజాబ్ అసెంబ్లీలో తాళంపై మాటల యుద్ధం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయకుండా లాక్ చేయమని భగవంత్ మాన్ స్పీకర్‌ను కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
Punjab Assembly Session: పంజాబ్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. బడ్జెట్ (Punjab Budget session)పై చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సభలోనే ఉంచేందుకు సీఎం భగవంత్ మాన్ స్పీకర్‌కు తాళం ఇవ్వడంతో పంజాబ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు పారిపోకుండా తాళం వేస్తామని మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ గేటు దగ్గర బీజేపీ నేతల బైఠాయింపు
పంజాబ్ అసెంబ్లీ(Punjab Assembly)లో బడ్జెట్ సెషన్ జరుగుతోంది. రెండో రోజు చర్చ ప్రారంభంకాకముందే... రైతుల ఉద్యమానికి సంబంధించి బీజేపీ సభ్యులు అసెంబ్లీ గేటు దగ్గర బైఠాయించారు. అసెంబ్లీలో గవర్నర్ (Punjab governor) ప్రసంగంపై చర్చ జరగాల్సి ఉంది. ఈ సందర్భంలో... చర్చ ప్రారంభించేందుకు ముందు.. సీఎం భగవంత్ మాన్.. స్పీకర్‌కు ఒక బహుమతి తీసుకొచ్చినట్టు చెప్పారు. తాళం వేసి ఉన్న పసుపు కవర్‌ను అసెంబ్లీ స్పీకర్ (Punjab speaker) కుల్తార్ సింగ్ సింధ్వాన్‌కు అందజేశారు. అందులో కీ ఉంది. చర్చ సందర్భంగా తాను నిజమే మాట్లాడతానని... దాన్ని ప్రతిపక్షాలు సహించరని... వారు సభను బహిష్కరించి బయటకు వెళ్లకుండా... లోపలి నుంచి సభ తలుపులు వేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఇది వినగానే సభలో రచ్చ మొదలైంది.
సీఎం మాన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైరయ్యాయి. తాము పారిపోబోమని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ (Congress) సభ్యుడు పర్తాప్ సింగ్ బజ్వా ముఖ్యమంత్రికి చెప్పడంతో మాటామాట పెరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని సీఎం గట్టిగా చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం భగవంత్ మాన్ కాంగ్రెస్ సభ్యులు బజ్వాపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరితో కూర్చుంటారు.. నాతోనేగా అని అన్నారు. మీరు ఎప్పుడైనా వారితో కూర్చున్నారా? అంటూ బజ్వాను ప్రశ్నించారు. ఒక వైపు సీటు షేరింగ్‌పై మాతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.. మరోవైపు ఇక్కడ గందరగోళం సృష్టిస్తారా అని ప్రశ్నించారు. మా కోసం కురుక్షేత్ర, ఢిల్లీ, గుజరాత్ లోక్‌సభ సీట్లు ఇవ్వవద్దని వెళ్లి వారికి చెప్పండని ఆయన అన్నారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయాన్ని కూడా మాన్ గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకుడిపై సెటైర్లు వేశారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న బజ్వా.. సీఎం అనుచిత పదాలు ఉపయోగించారంటూ మండిపడ్డారు.
తలుపులు లోపలి నుంచి లాక్ చేయాలి
చర్చ జరుగుతుంటే ఎలా వినాలో కాంగ్రెస్‌కు తెలియదని... అందుకే అసెంబ్లీ తలుపులు లోపలి నుంచి లాక్ చేయమని చెప్పానన్నారు సీఎం భగవంత్ మాన్. దీనిని ఖండిస్తూ... తాము కూలీలమా... అంటూ ప్రశ్నించారు. ఇంత బలహీనమైన స్పీకర్‌ను చూడలేదన్నారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో... స్పీకర్ జోక్యం చేసుకున్నారు. సభలో చర్చ జరిగేలా చూసేందుకు తాళం ఓ సంకేతమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
పంజాబ్‌లో మార్చి ఒకటిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో.. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రసంగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. రైతుల సమస్యలను లేవనెత్తారు. సభలో నినాదాలు చేశారు. గందరగోళం మధ్య.. గవర్నర్ పురోహిత్ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. కొంత మాత్రమే చదివి... మిగిలిన వాటిని చదివినట్లుగా పరిగణించమని చెప్పి వెళ్లిపోయారు. కాంగ్రెస సభ్యుల తీరుపై మండిపడ్డ సీఎం భగవంత్ మాన్... రెండో రోజు సభ ప్రారంభం అవుతూనే.. వారిపై సెటైర్లు వేశారు.