Pune Bridge Collapse: ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన, 30 మంది పర్యాటకులు గల్లంతు- 3 మృతదేహాలు వెలికితీత
పుణేలోని ఇంద్రాయని నదిపై వంతెన కూలిపోయింది. ఇంద్రియాని నదిలో 25 నుంచి 30 మంది గల్లంతయ్యారు. మూడు మృతదేహాలను వెలికితీశారు.

Pune Bridge collapse: మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.
పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన జూన్ 15న మధ్యాహ్నం 3.40 గంటలకు జరిగిందని తెలుస్తోంది. వంతెన కూలిన చోట రాళ్లు కూడా ఉన్నాయి. రాళ్లపై పడిన వారికి తీవ్ర గాయాలు కాగా, పలువురు నదిలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.
కుండమాల దాటే వంతెన కూలిపోయింది
పింప్రి-చింఛ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తలేగావ్ దాభడే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుండమాలను దాటడానికి ఒక వంతెన ఉంది, ఇక్కడ నుండి అటువైపు వెళ్లడానికి అదొక్కటే మార్గం. కానీ దురదృష్ణవశాత్తూ ఈ వంతెన కూలిపోయింది.
సెలవు కారణంగా అధిక రద్దీ
ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. కొంతమంది ఇంద్రాయని నదిపై ఉన్న వంతెనపై నిలబడి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దాంతో పలువురు నీళ్లలో పడిపోయారు. ఎంతమంది మునిగిపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 25 నుంచి 30 మంది నీటిలో పడి కొట్టుకుపోయారు. సంఘటనా స్థలంలో దాదాపు 200 మంది పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత, రెస్క్యూ ఆపరేషన్లకు ఏ ఇబ్బంది కలగకుండా పర్యాటకులను అక్కడి నుంచి తరలించారు.
బైక్‌లతో వంతెనపైకి చేరుకున్న ప్రజలు
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ వంతెన వద్దకు వస్తుంటారు. సెలవు రోజుల్లో అక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి దేవాలయాన్ని దర్శించుకుంటారు. ప్రస్తుతం, NDRF రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెనపై కొంతమంది బైక్‌లతో చేరుకున్నారని తెలుస్తోంది. ఎక్కువ బరువును మోసే సామర్థ్యం లేక వంతెన కూలిపోయింది.
#WATCH పుణే, మహారాష్ట్ర: పింప్రి-చింఛ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండమాల గ్రామం సమీపంలో ఇంద్రియాని నదిపై వంతెన కూలిపోయింది. 10 నుంచి 15 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 5 నుంచి 6 మందిని రక్షించారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నాం: పింప్రి చింఛ్వాడ్ పోలీస్ pic.twitter.com/Fl8O2rt6iK
— ANI_HindiNews (@AHindinews) June 15, 2025
వంతెన గురించి ఫిర్యాదులు
వంతెన కండీషన్ సరిగ్గా లేదని గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వంతెన శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సంఘటనా స్థలానికి అంబులెన్సులు
రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం చేశారు. పర్యాటకులను రక్షించడానికి 20 వరకు అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం కావడంతో రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి పలు టీమ్స్ అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నది ప్రవాహం దిశలో ఉన్న గ్రామాల్లోనూ వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






















