Chandrayaan 3: గత ప్రభుత్వాలకు ఇస్రోపై నమ్మకం లేదు: నంబి నారాయణన్ సంచలన వ్యాఖ్యలు
Chandrayaan 3: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రోపై గత కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు.
Chandrayaan 3: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రోపై గత కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్రోకు తగినంత నిధులు కేటాయించలేదన్నారు. ఇస్రోపై ప్రభుత్వానికి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ఇస్రో ప్రారంభ రోజుల గురించి నంబి నారాయణన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఇస్రోకు కేటాయించిన నిధుల గురించి నంబి నారాయణన్ మాట్లాడిన వీడియోను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షేర్ చేసింది.
వీడియోలో నంబి నారాయణన్ మాట్లాడుతూ.. ఇస్రో తన విశ్వసనీయతను నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వం అంతరిక్ష సంస్థకు నిధులు అందించిందన్నారు. ఇస్రో ప్రారంభంలో తమకు జీపు, కారు, ఇతర యంత్రాలు ఏమీ లేదన్నారు. తమకు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్పారు. బడ్జెట్ అడగడానికి లేదని, అప్పటి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. దాని గురించి ఫిర్యాదు చేయనని, కానీ అప్పటి ప్రభుత్వానికి తమపై నమ్మకం లేదన్నారు.
‘మోదీ మీకు నచ్చకపోదే అది మీ సమస్య’
చారిత్రాత్మక మూన్ మిషన్ ల్యాండింగ్ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నంబి నారాయణన్ స్పందించారు. చంద్రయాన్ -3 వంటి జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని కాకపోతే ఇంకెవరికి క్రెడిట్ దక్కుతుందని ప్రశ్నించారు. "జాతీయ ప్రాజెక్టులోకి వెళ్తే ఇంకెవరికి క్రెడిట్ దక్కుతుంది. ఆయనే ప్రధాని. ప్రధాని అంటే మీకు నచ్చకపోవచ్చు. అదే మీ సమస్య' అంటూ నంబి వ్యాఖ్యానించారు. స్పేస్ సైంటిస్టులకు సకాలంలో జీతాలు అందడం లేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. జీతాలు, పింఛన్ల జమలో ఎలాంటి జాప్యం జరగలేదనీ, ప్రతి నెలా 29వ తేదీన పింఛన్ వస్తుందని నంబి నారాయణన్ చెప్పారు.
చంద్రయాన్-3పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఎక్స్(ట్విటర్)లో ఇంటర్వ్యూ వీడియోలను పంచుకున్నారు. భారతదేశ అంతరిక్ష యాత్రల పరిశోధనలకు ప్రధాని మోదీ పెద్ద మొత్తంలో బడ్జెట్‌లను కేటాయించారని అన్నారు. ప్రధాని బడ్జెట్‌లను పెంచి, మన శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. భారతదేశం అంతరిక్ష యాత్రలు చాలా ముందుకు వచ్చాయని ఆయన రాశారు. ఆగస్ట్ 23న చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, ల్యాండింగ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. చంద్రయాన్ ల్యాండింగ్ తర్వాత త్వరగా తెరపైకి వచ్చి మోదీ క్రెడిట్ తీసుకున్నారని, ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతు ఇవ్వడంలో మోదీ ప్రభుత్వం ఎందుకు ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో విమర్శించారు.
Also Read: ABP-CVoter Poll: చంద్రయాన్-3 సక్సెస్ క్రెడిట్ ఎవరిది- మోదీ దా! నెహ్రూ దా?
ABP న్యూస్, CVoterతో కలిసి, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చారిత్రాత్మక విజయం క్రెడిట్ ఎవరికి దక్కాలని వారు భావిస్తున్నారనే అంశంపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి ఒక స్నాప్ పోల్ నిర్వహించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మద్దతుదారుల్లో ఎక్కువ మంది ప్రధాని మోదీకి అనుకూలంగా చెప్పారు. 35.5% మంది ప్రధాన మంత్రి మోదీకే చంద్రయాన్ సక్సెస్ క్రెడిట్ దక్కుతుందన్నారు. 5.4% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేదా జవహర్ లాల్ నెహ్రూకు దక్కుతుందని అభిప్రాయపడ్డారు. 3.9% మంది ఇరు పార్టీలకు క్రెడిట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎక్కువగా 53.9% మంది శాస్త్రవేత్తలకు చంద్రయాన్ 3 క్రెడిట్ ఇచ్చారు. వారు మాత్రమే ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. మరో 1.3% మంది ఈ విషయంపై ఎటు తేల్చలేకపోయారు.
ప్రతిపక్ష మద్దతుదారుల్లో సైతం ప్రధాని మోదీకి 21.9% మంది క్రెడిట్ ఇచ్చారు. 10.5% మంది నెహ్రూకి మద్దతు తెలిపారు. 5.5% మంది ఇద్దరు నాయకులకు ఆ అర్హత ఉందన్నారు. 60.3% మంది మాత్రం చంద్రయాన్ మిషన్ విజయవంతానికి వెనుక ఉన్న శాస్త్రవేత్తలకు మాత్రమే క్రెడిట్ దక్కాలని నొక్కి చెప్పారు. 1.8% మందితో ఏ విషయంలో అనిశ్చితంగా ఉన్నామని, తాము ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదని చెప్పారు.
అలాగే చంద్రయాన్-3 విజయానికి క్రెడిట్ తీసుకోవడానికి చేస్తున్న రాజకీయాలు సరైనవా కాదా అని ఎన్డీఏ మద్దతుదారుల్లోని ప్రజలను అడిగారు. అందులో 54.1% మంది క్రెడిట్ రాజకీయాలు అన్యాయమని అభిప్రాయపడ్డారు. అయితే 29.5% మంది క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు సరైనవే అని వాదించారు. మిగిలిన 16.4% మంది దీనిపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదన్నారు. ప్రతిపక్ష మద్దతుదారుల్లో సైతం 59.8% మంది చంద్రయాన్ విజయాన్ని రాజకీయం చేయడాన్ని తప్పుడు చర్యగా భావిస్తున్నారు. 21.5% మంది రాజకీయాలను సమర్థించారు. దాదాపు 18.7% మంది అభిప్రాయాన్ని చెప్పలేదు.