(Source: ECI/ABP News/ABP Majha)
Ayyappa Prasadam: అయ్యప్ప భక్తులకు చేదు వార్త, ట్రావెన్స్‌కోర్ ఆలయం కీలక నిర్ణయం
Sabarimala Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదానికి ఉండే డిమాండ్ వేరు. అక్కడి వెళ్లిన వారు పదుల సంఖ్యలో ప్రసాదం డబ్బాలను తీసుకొస్తారు.
Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదానికి ఉండే డిమాండ్ వేరు. అయ్యప్ప ప్రసాదం టేస్ట్ ఎంతో విభిన్నం. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డు, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తర్వాత.. శబరిమల అరవణి ప్రసాదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడి వెళ్లిన వారు పదుల సంఖ్యలో ప్రసాదం డబ్బాలను తీసుకొస్తారు. బంధుమిత్రులకు పంచుతారు. అయితే ఇప్పుడు ఆలయంలో భక్తులకు సరైన స్థాయిలో ప్రసాదం అందడం లేదు. ఆలయంలో ప్రసాదానికి కొరత ఏమీ లేదు. అసలు వచ్చిన సమస్య అంతా డబ్బాలతోనే. శబరిమల ప్రసాదం అందించే డబ్బాలకు కొరత ఏర్పడింది. దీంతో భక్తులకు సరైన సంఖ్యలో ప్రసాదం డబ్బాలు దొరకడం లేదు. దీంతో స్వామి వారి ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు పరిమితి విధించింది. ఒక్కో భక్తుడికి కేవలం 2 డబ్బాలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీంతో భక్తుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఎన్నో వంద కిలోమీటర్ల నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరు పదుల సంఖ్యలో తీసుకువెళ్తారు. పూజల తరువాత తమ బంధువులు, చుట్టుపక్కల వారికి పంచుతారు. ఇందు కోసం ఒక్కొక్కరు పదికిపైగా ప్రసాదం డబ్బాలను తీసుకెళ్తారు. అలాంటి వారికి దేవస్థానం ఇస్తామంటున్న 2 డబ్బాలు ఏమాత్రం సరిపోవు. ఇచ్చిన రెండు డబ్బాల్లో ఒక దానికి అయ్యప్ప భక్తులు ఆలయం దగ్గరే తినేస్తారు. మరో డబ్బాను తమ కుటుంబ సభ్యుల కోసం తీసుకెళ్తారు. అది ఇంట్లో వారికే సరిపోదు. మరి స్నేహితులు, చుట్టుపక్కల వారు వారికి ఎలా ఇవ్వాలని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆలయం దగ్గర రద్దీ విపరీతంగా ఉంటోంది. కిలోమీటర్ల మేర క్యూ ఉంటోంది. స్వామి వారి దర్శనానికి రోజులు పడుతోంది. సంక్రాంతి సమయంలో మకర జ్యోతిని చూసేందుకు స్వాములు పెద్ద సంఖ్యలో వెళ్తారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా ప్రసాదం తయారీ ఉంటున్నా.. డబ్బాల తయారీ మాత్రం ఆలస్యం అవుతోంది. దీంతో దేవస్తానం భక్తులు అందరికీ ప్రసాదం అందేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో భక్తుడికి రెండు డబ్బాల చొప్పున మాత్రమే ఇస్తోంది. దీనిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎక్కువ సంఖ్యలో ప్రసాదం డబ్బాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
అరవణి ప్రసాదం గురించి తెలుసా?
శబరిమల అరవణి ప్రత్యేకత వేరు. బెల్లం, బియ్యం, నెయ్యి ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తయారు చేస్తారు. కేరళలో పూజలు, పర్వదినం సమయాల్లో అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. ఇందుకోసం, ఎర్రబియ్యం, నల్ల బెల్లం, నెయ్యి, జీడిపప్పులు, పచ్చి కొబ్బరి ముక్కలు, శొంఠి పొడి, నీళ్లు ఉపయోగిస్తారు.
తయారీ విధానం
ముందుగా నల్ల బెల్లాన్ని మొత్తగా తురిమి దానిని ఒక పాత్రలో వేసుకుని కరిగించాలి. మరో పాత్రలో నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి, జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యాన్ని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించే సమయంలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆపై అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. దీనిలో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వేయాలి. తర్వాత కొంచెం శొంఠి పొడిని కలిపి.. నెయ్యి వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే.. స్టౌ ఆఫ్ చేసి.. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. దీంతో ఫైనల్‌గా శబరిమల అరవణ పాయసం ప్రసాదం రెడీ అవుతుంది. ఈ ప్రసాదం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన తయారీ విధానం అధికారిక తయారీ విధానం కాదు.. వివిధ మార్గాల ద్వారా తెలుసుకుని పాఠకులకు అందిస్తున్న సమాచారం మాత్రమే.