PM Viswakarma Scheme: పీఎం విశ్వకర్మ యోజన పథకం ఎవరు దరఖాస్తు చేయొచ్చంటే..!
Telugu News: చేతి వృత్తుల వారికి ఆర్థిక చేయూత అందించే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
Pradhan Mantri Vishwakarma Yojana: చేతి వృత్తుల వారికి ఆర్థిక చేయూత అందించే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చేతి వృత్తులు, సంప్రాదాయ పనిముట్టపై ఆధారపడిన కళాకారులు, వృత్తిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్ల రూపాయల నిధులను రుణాలు రూపంలో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..? ఈ పథకంలో భాగంగా చేకూరనున్న లబ్ధి ఏమిటి..? వంటి వివరాలను మీరు తెలుసుకోండి.
ప్రధాన మంత్రి విశ్వకర్మ అంటే..?
చేతి వృత్తుదారులు, హస్తకళాకారులు, సంప్రాదాయ పనిముట్టతో పనులు సాగించే వారికి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడంతోపాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయా వృత్తుల్లో శిక్షణ పొందిన వారికి అధునాతన పరికరాలు అందించడం ద్వారా వృత్తిలో వేగాన్ని పెంచే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు..?
ఈ పథకానికి చేతి వృత్తులు, సాంప్రదాయ వృత్తులు సాగించే వాళ్లు అర్హులుగా ఉంటారు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు, వ్యాపారాల్లో నైపుణ్యం కలిగిన, చేతివృత్తులు సాగించే వాళ్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. 18 రకాల పనులు/వృత్తులు చేసే చేసే వారికి ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో కార్పెంటర్, బోట్ మేకర్, ఆర్మర్, కమ్మరి, హామర్ అండ్ టూల్ కిట్ మేకర్, గోల్డ్ స్మిత్, తాలాలు వేసేవాళ్లు, కుమ్మరి, శిల్పి, రాళ్లు పగులగొట్టేవాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, మేసన్(రాజ్ మిస్ర్టీ), సాంప్రదాయ పద్ధతిలో వస్తువులు తయారు చేసేవాళ్లు, నాయి బ్రహ్మణులు, టైలరింగ్ చేసేవాళ్లు, రజకులు, గార్లాండ్ మేకర్(మలకార్), మత్స్యకార వలలలు తయారు చేసేవాళ్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.
ఇవీ ప్రయోజనాలు
ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా అర్హులైన వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చేలా రుణాలు ఇవ్వడంతోపాటు నైపుణ్యాలు మెరుగుపర్చేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది. ఆయా రంగాలకు చెందిన వృత్తిదారులు తయారు చేసే వస్తువులను మార్కెట్ చేయడానికి అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. అంతిమంగా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు తయారు చేసే ఉత్పత్తుల స్థాయి పెంచడానికి, వారికి స్థిరమైన జీవనోపాధిని, వృద్ధికి అవసరమైన సాధనాలు అందించడంతోపాటు అవకాశాలను అందించేందుకు సహకరించనున్నారు. లక్ష వరకు తక్కువ వడ్డీతో రుణం ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వారికి మళ్లీ రుణాలు ఇవ్వనున్నారు. ఈ రుణాలతో వారి వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అలాగే, హస్త కళాకారులు వారి సంబంధిత చేతివృత్తుల్లో వారి నైపుణ్యాన్ని గుర్తించి సర్టిఫికెట్, గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు. వారికి నైపుణ్య శిక్షణ, నైపుణ్య అసెస్‌మెంట్ తరువాత వ్యాపారానికి ఉపయుక్తమయ్యే ఆధునీకరించిన పరికరాలతో కూడిన కిట్‌ను గానీ, కిట్ కొనుగోలుకు అవసరమైన రూ.15 వేలు రూపాయలు ప్రోత్సాహకాన్ని అందుకోనున్నారు. విశ్వకర్మలకు రోజుకు రూ.500 స్టెఫండ్‌తో ఐదు నుంచి ఏడు రోజులపాటు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో అధునాతన పరికరాలు, డిజటల్, ఆర్థిక నైపుణ్యాలు, వ్యవస్థాపకత, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్‌లు నేర్పించనున్నారు.
ఇవి తప్పనిసరి..
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుగానీ, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి. చిరునామాను ధృవీకరించే బిలల్లులు ఉండాలి. ఆదాయ ప్రమాణాలు ప్రకారం అర్హతను నిరూపించే పత్రం తప్పనిసరిగా ఉండాలి. పథకానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహణకు బ్యాంక్ ఖాతా వివరాలు అందించాలి. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే పీఎం విశ్వకర్మ యోజన కోసం అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్, ఈసేవ కేంద్రాలు, గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.