Modi Speech: NDAకి రెండు ‘I’లు తగిలించి I.N.D.I.A చేశారు, ఇది అహంకారపూరిత సంకీర్ణం - మోదీ
పార్లమెంటులో మూడో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై వ్యాఖ్యలు చేశారు.
యూపీఏని I.N.D.I.Aగా పేరు మార్చినంత మాత్రాన ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం (ఆగస్టు 10) పార్లమెంటులో మూడో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై వ్యాఖ్యలు చేశారు. అది పాత బిల్డింగ్‌కి కొత్త పెయింట్ వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి దేశ ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరిస్తున్నారన్న ఆయన.. ప్రతి రాష్ట్రంలో ఆ పార్టీ ఎలా ఉనికి కోల్పోయిందో వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి పథకానికీ వాళ్ల పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఓటర్ల నమ్మకం విపక్షాలు ఎప్పుడో కోల్పోయాయని అన్నారు.
NDA కు రెండు ‘I‘లు చేర్చి..
‘NDAకు రెండు ‘I’లు చేర్చి I.N.D.I.A పేరుతో మళ్లీ 16 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీల నేతలు రాష్ట్రాల్లో తిట్టుకుంటారని.. ఇక్కడకు వచ్చి కలిసిపోతారని ఎద్దేవా చేశారు. ఆ చర్యలు, మీ చేష్టలను యావత్ దేశం గమనిస్తోందని అన్నారు. ఇది ఇండియా సంకీర్ణం కాదు.. అహంకార పూరితమైనదని కొట్టిపారేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటారని అన్నారు. 21 రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ఈ పార్టీల సంకీర్ణం ఉంటుందని.. ఎన్ని కొత్త జట్లు కట్టినా.. ఓటమి ఖాయం’ అని ప్రధాని మోదీ అన్నారు.
అవినీతిమయమైన పార్టీలన్నీ కూటమి పేరుతో ఒక్క చోట చేరారని మండి పడ్డారు. రాహుల్ గాంధీ తనను రావణుడితో పోల్చడంపైనా స్పందించారు ప్రధాని మోదీ. దేశ ప్రజలందరినో రాముడితో పోల్చారు. హనుమంతుడు లంకను తగలబెట్టలేదని, రావణుడి పొగరుని తగలబెట్టాడని అన్నారు. రావణుడి గర్వం వల్లే లంక తగలబడిపోయిందని రాహుల్‌కి బదులిచ్చారు. రాహుల్ గాంధీకి కలలో కూడా తానే కనిపిస్తున్నానని సెటైర్లు వేశారు. ఆయన ప్రేమ అలాంటిది అని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.
పార్లమెంట్ ద్వారా మణిపూర్‌కి ఓ సందేశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇలాంటి సమస్యపై రాజకీయాలు చేయడం సరికాదని తేల్చి చెప్పారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. మహిళలపై దారుణాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ మణిపూర్‌కి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతి త్వరలోనే అక్కడి ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భరత మాత గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మణిపూర్‌పై చర్చ చేయకుండా విపక్షాలు పారిపోయాయని ఎద్దేవా చేశారు.