PM Modi: ఎన్నికల ప్రచారంలో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రధాని మోదీ, 76 రోజుల్లో ఏకంగా 206 ర్యాలీలు
Modi Election Campaign: దేశంలో ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. 76 రోజుల పాటు ర్యాలీలు, రోడ్ షోలు, సభలు అన్ని కలిపి 206 ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు.
Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా చివరి, ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయత్రం ఆరు గంటలకు ముగిసింది. జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు దేశ వ్యాప్తంగా జూన్ 4న జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా నేతలు అందరూ విసృతంగా ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం అవిశ్రాంత పోరాటం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు మార్చి 16 నుంచి ప్రధాని ఎన్నికల మారథాన్ నిర్వహించారు.
76 రోజులు 206 ప్రచార కార్యక్రమాలు
దేశంలో ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మార్చి 16 నుంచి మే 30 వరకు 76 రోజుల పాటు ర్యాలీలు, రోడ్ షోలు, సభలు అన్ని కలిపి 206 కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గత మూడు రోజులుగా రోజుకు ఐదు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అంతే కాదు గత 22 రోజులుగా రోజుకు నాలుగు చోట్ల ప్రచారం చేశారు. భారతదేశ వ్యాప్తంగా మే నెలలో ప్రధాని 96 ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు.
నాలుగు రాష్ట్రాలపై దృష్టి
ప్రధాని మోదీ ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. అత్యధిక లోక్ సభ స్థానాలు (80 స్థానాలు) ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. 2019లో యూపీలో ఎన్డీఏ 64 సీట్లు గెలుచుకుంది. ఈ సారి కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తరువాత బీహార్‌లో 20 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. మహారాష్ట్ర 19, పశ్చిమ బెంగాల్‌లో 18 కార్యక్రమాల్లో పాల్గొని ఎన్డీఏ తరఫున ప్రచారం చేశారు. ఈ సారి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన సంఖ్యను పెంచుకోవాలని భావించింది. అందుకే ప్రధాని మోదీ కోల్‌కతాలో పెద్ద రోడ్ షోతో పాటు 18 ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ముంబై, పాట్నాలలో ప్రధాని మోదీ రోడ్‌షోకు కూడా భారీగా జనం తరలివచ్చారు.
ఒడిశాపై కన్నేసిన బీజేపీ
ఒడిశాలో బీజేపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పాఠక్‌కు చక్ పెట్టేందుకు ప్రధాని 10 ర్యాలీలు నిర్వహించారు. పూరీలో భారీ రోడ్ షో నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో 10 ప్రాంతాలు, జార్ఖండ్‌లో 7 చోట్ల మోదీ ప్రచారం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో నాలుగు ప్రాంతాల చొప్పన ప్రచారం నిర్వహించారు.
దక్షిణంలో ఉనికి కోసం పోరాటం
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి కాపాడుకునేందుకు పోరాటం చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 35 ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో కూడా అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11 చొప్పన, తమిళనాడులో ఏడు ప్రచారాలు చేశారు.
సొంత రాష్ట్రంలో ఐదు కార్యక్రమాలు
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆయన ఐదు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మే 30న హోషియార్‌పూర్‌లో చివరి ప్రచార ర్యాలీ నిర్వహించారు. పంజాబ్‌లో నాలుగు, హర్యానాలో మూడు ర్యాలీలు చేపట్టారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రెండు చొప్పున ర్యాలీలు చేశారు. నిరంతరాయంగా చేసిన ప్రచారాలతో మోదీ తన 2019 రికార్డును చెరిపేశారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ దాదాపు 145 బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు.