Janga Reddy Passed Away: బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతిపై ప్రధాని మోదీ సహా ప్రముఖ నేతల సంతాపం
జన సంఘ్‌ను, బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసిన నేతలతో జంగారెడ్డి ఒకరు అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.
Janga Reddy Passed Away: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి నేటి ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నేత జంగారెడ్డి మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జన సంఘ్‌ను, బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసిన నేతలతో జంగారెడ్డి ఒకరు. పార్టీ క్లిష్టమైన పరిస్థితులో ఉన్నప్పుడు తన వంతుగా విశేషంగా శ్రమించిన జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, పలువురు ప్రముఖులు బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో సైతం ట్వీట్ చేశారు. ‘సి . జంగా రెడ్డి ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు . జన సంఘ్ నూ , బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తి నిచ్చారు. ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను. భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలిపాను. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్విట్ చేశారు.
‘బిజెపి అగ్రనేత సి.జంగారెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాను. 1984 ఎన్నికలలో గెలిచిన ఇద్దరు BJP MPలలో వీరు కూడా ఒకరు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, బీజేపీ బలోపేతం చేయటానికి వారు చేసిన కృషి మరువలేనిది. వారికి నా నివాళులు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ నివాళి అర్పించారు.
‘తెలంగాణ బీజేపీ కురువృద్ధులు, మా మామయ్య గారు, రెండు సార్లు జన సంఘ్ నుండి ఎమ్మెల్యేగా, 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు MPలలో ఒకరైన చందుపట్ల జంగా రెడ్డి ఈ రోజు ఉదయం స్వర్గస్థులైనారని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నానని’ బీజేపీ నాయకురాలు, భూపాళపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ కీర్తిరెడ్డి చందుపట్ల తెలిపారు. ఈ రోజు సాయంత్రం హన్మకొండలోని మా స్వగృహం నుంచి జంగారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి పార్దివదేహానికి శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే ఆరుణ, డాక్టర్ లక్ష్మణ్, సీహెచ్ విద్యాసాగర్ తదితరులు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Janga Reddy Passes Away: బీజేపీ మాజీ ఎంపీ జంగా రెడ్డి కన్నుమూత, తొలి ఇద్దరు నేతల్లో ఆయన ఒకరు