Bank Loans Tension : పెరుగుతున్న వడ్డీ రేట్లు - తగ్గుతున్న రుణ లభ్యత ! ప్రజలకు మరో కష్టం ఇన్‌కమింగ్...
వడ్డీ రేట్ల పెంపుతో మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నారు జనం. పాత రుణాలకు చెల్లించాల్సిన మొత్తం ఆటోమేటిక్‌గా పెరిగిపోతోంది.
Bank Loans Tension : ప్రపంచ దేశాల అప్పు 23100 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆయా దేశాలు చేస్తున్న రుణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF ) కొద్ది రోజుల కిందటే హెచ్చరించింది. చేసిన రణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపుల కోసం ఆయా దేశాల్లో కీలకమైన ప్రభుత్వ సేవలకు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొన్నది. దాదాపు 100కు పైగా దేశాలు రుణ వాయిదాల చెల్లింపు కోసం కీలకమైన ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యంపై వ్యయాన్ని తగ్గించుకోనున్నాయని తెలిపింది. కోవిడ్-19 సంక్షోభం ఆయా దేశాల్ని అనివార్యంగా అప్పుల ఊబిలో కూరుకపోయేలా చేసింది. ఈ సమస్యను ఉక్రెయిన్ సంక్షోభం మరింత పెంచింది. గ్లోబల్ డెట్‌లో తక్కువ ఆదాయమున్న దేశాలు చేసిన అప్పులు, కుటుంబ రుణాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
అంతకంతకూపెరుగుతున్న వడ్డీ రేట్లు !
ఓ వైపు రుణాలు పెరిగిపోవడంతో.. మరోవైపు వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. కట్టాల్సిన వడ్డీ అటు దేశాలకైనా ఇటు సామాన్యులకైనా భారంగా మారుతోంది. రుణాలు తీసుకున్న దేశాలు రుణ చెల్లింపులో విఫలమైతే అది ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దానివల్ల ఉపాధి కల్పన, విస్తరణకు నిధులు అందుబాటులో ఉండవని, దివాళా కేసుల పరిష్కారం సంక్లిష్టంగా మారుతుందని, వ్యాపార సంస్థలు రుణాలు చెల్లించలేకపోతాయని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. అంతేకాదు వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు ఆహారం, ఇంధనంపై ఖర్చును తగ్గిస్తారు. అల్పాదాయ దేశాల్లో 60శాతం రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయని ఐఎంఎఫ్ తెలిపింది.
ప్రజలు వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి !
ప్రజలకు వడ్డీ రేట్లు పెంచి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గత్యంతరం లేక అప్పులు తీసుకున్న వారికి నరకం కనిపిస్తోంది. నెలసరి ఖర్చులు పెరిగి.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి జారుకునే ప్రమాదం ఉంది. రెపో రేట్లు పెంచడం వల్ల తమకెలాంటి ఇబ్బందీ లేదనుకుంటే పొరపాటే. ఇదీ పరోక్షంగా దేశంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు ఆధారంగానే అవి కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి. ఈ సారి జరిగింది కూడా అదే..ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో... రుణగ్రహీతలపై వడ్డీ భారం పెరగనుంది.
అప్పలన్నింటిపై వడ్డీ భారం పెంపు !
ఒక్క సారి రెపో రేటు పెరిగిందంటే బ్యాంకులు రెచ్చిపోతాయి గృహ, వాహన,ఇతర రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. చివరకు పర్సనల్ లోన్స్ పైనా భారం తప్పదు. వ్యక్తిగత లోన్ తీసుకునేందుకు కస్టమర్లు భయపడాల్సిందేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాంకులు కూడా కనికరం చూపించే అవకాశం ఉంది. తమ వ్యాపార లావాదేవీలను, లాభాలను తగ్గించుకునేందుకు అవి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించవు. రెపో రేటు పెరిగినప్పుడల్లా హౌసింగ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతోంది. బ్యాంకులను బట్టి రుణగ్రహీతలు చెల్లించాల్సిన కిస్తీ పెరుగుతుంది. మెజార్టీ సందర్భాల్లో బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వవు. ఏదేమైనా వడ్డీ రేట్లు పెరుగుదల ప్రజలకు భారమవుతోంది. అసలే కరోనా తర్వాత ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచడం కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.