Opposition Party Meet: ముంబయి వేదికగా మరోసారి ప్రతిపక్షాల భేటీ, మరింత బలం పెంచుకోబోతున్న I.N.D.I.A!
Opposition Party Meet: ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 31వ తేదీన, సెప్టెంబర్ 1న మరోసారి భేటీ కాబోతున్నాయి.
Opposition Party Meet: ఎన్డీయేను గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీలు మరోసారి భేటీ కాబోతున్నాయి. I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) లోని 26 బీజేపీయేతర పార్టీలు మూడో సారి జాతీయ స్థాయి సమావేశానికి సిద్ధం అవుతున్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయి వేదికగా ఈ భేటీ జరగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనని NDA(నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) నిర్వహించనున్న సమావేశానికి సమాంతరంగా ఉంటుందని అంటున్నారు. ఇలా అధికారపక్షం తన కూటమి పక్షాలతో కలిసి సమావేశం అవుతున్న సమయంలోనే.. ప్రతిపక్ష పార్టీల కూటమి సమావేశం నిర్వహిస్తుండటం ఇది రెండోసారి.
బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) కూటమి మహారాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఈ ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. అజిత్ పవార్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్సీపీ ఎంపీ సునీల్ తట్కరే మాట్లాడుతూ.. ఈ సమావేశంలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు పాల్గొంటాయని తెలిపారు.
విస్తరించనున్న I.N.D.I.A !
ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే I.N.D.I.A కూటమి సమావేశంలో అధికారిక ఉమ్మడి లోగోను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రాల ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రతిపక్ష కూటమికి ఊతమిచ్చేలా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా I.N.D.I.A కూటమిలో చేరబోతున్నాయని ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల నుంచి కొన్ని పార్టీలు కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉన్నాయని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఆయా పార్టీల చేరికకు సంబంధించి కూటమిలోని అన్ని పార్టీలు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాయన్నారు.
అయితే ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు కాబోతున్నారు అనే నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు పీఎల్ పునియా మాట్లాడారు. I.N.D.I.A కూటమి విజయం తర్వాత మాత్రమే ప్రధాని అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు.
ఈ సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా బీజేపీయేతర నేతలు, నితీశ్ కుమారు, మమతా బెనర్జీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శరద్ పవార్ తదితరులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపక్ష కూటమి సమావేశం సజావుగ సాగేందుకు, సమావేశానికి సంబంధించిన వివిధ ఏర్పాట్లను నిర్వహించడానికి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో మీడియా నిర్వహణ, సోషల్ మీడియా, వసతి, రవాణా ఏర్పాట్లు, భద్రత, ప్రముఖులను స్వాగతించడం వంటి పనులకు బాధ్యత వహిస్తాయి. ప్రతి కమిటీలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నాయకులు ఉంటారు.
Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!
మీడియా కవరేజీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం, ఇతర కమ్యూనికేషన్ ఛానళ్లను పర్యవేక్షించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంది. సమావేశం కోసం రవాణా నిర్వహణ బాధ్యతను ఎన్సీపీ నిర్వహిస్తోంది. ప్రతిపక్ష పార్టీల మూడో సమావేశానికి హోస్ట్‌గా, వకోలాలోని గ్రాండ్ హయత్ హోటల్ లో సమావేశానికి సంబంధించిన బస, విందు, ఇతర ఏర్పాట్లను శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) చూసుకుంటోంది. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు, నేతలు బస చేసేందుకు రెండ్రోజులుగా దాదాపు 150 గదులను బుక్ చేశారు. ఈ సమావేశానికి ఐదుగురు ముఖ్యమంత్రులతో పాటు 26 వేర్వేరు పార్టీలకు చెందిన దాదాపు 80 మంది ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.