Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదానికి కారణం అదే! కీలక వివరాలు వెల్లడించిన సీబీఐ
Odisha Train Tragedy: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి సీబీఐ కీలక వివరాలు వెల్లడించింది.
Odisha Train Tragedy: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాదం గురించి సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ - సీబీఐ.. అసలు ప్రమాదానికి కారణాలేంటో వివరించింది. అనుమతులు లేని రిపేర్ పనులు చేపట్టడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని వెల్లడించింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్, సిగ్నల్ ఇంఛార్జ్ అయిన అరుణ్ కుమార్ మహంత.. ఉన్నతాధికారులు నుంచి అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ విషయాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వివరించింది. అయితే ఈ ఘోర రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ గతంలో ముగ్గురు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అరుణ్ కుమార్ మహంత కూడా ఒకరు. అయితే, తాజాగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోనని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మహంత బెయిల్ పిటిషన్ ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.
బహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్ లెవల్ గేట్ వద్ద మరమ్మతు పనులు అరుణ్ కుమార్ మహంత సమక్షంలోనే జరిగాయని సీబీఐ కోర్టుకు వివరించింది. ఈ క్షేత్ర స్థాయి రిపేర్ పనుల కోసం ఆయన సీనియర్ డివిజనల్ ఇంజినీర్ (సిగ్నల్ అండ్ టెలికాం) నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, కనీసం సర్క్యూట్ చిత్రం కూడా తీసుకోలేదని సీబీఐ తెలిపింది. గేట్ నంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్ చిత్రం ఆధారంగానే 94వ క్రాసింగ్ లెవల్ గేట్ వద్ద రిపేర్ వర్క్స్ జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సీబీఐ తెలిపింది. ఈ మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో మహంత అక్కడే ఉన్నారని, ఆయన సమక్షంలోనే పనులు రిపేర్ పనులు జరిగాయని పేర్కొంది. అందువల్ల అరుణ్ కుమార్ మహంతకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా కోరింది.
బెయిల్ పిటిషన్ పై అరుణ్ కుమార్ మహంత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 94వ లెవల్ క్రాసింగ్ గేట్ కొన్ని రోజులుగా సరిగ్గా పని చేయడం లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని కోర్టుకు వెల్లడించారు. పర్యవేక్షణ పనిని ఇతర వ్యక్తులకు అప్పగించారని, అందువల్ల ప్రమాదానికి మహంత బాధ్యుడు కాదని వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. అరుణ్ కుమార్ మహంతకు బెయిల్ నిరాకరించింది.
Also Read: Praggnanandhaa Mother: ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోయిన తల్లి, వైరల్ అవుతున్న పిక్‌పై ఆమె ఏమన్నారంటే?
సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ ఇన్‌స్టాలేషన్లను పరీక్షించడం, సరిదిద్దడం, మార్పులు చేయడం అరుణ్ కుమార్ మహంత విధుల్లో భాగమని కోర్టు పేర్కొంది. ఉన్నతాధికారులు ఆమోదించిన సూచనలకు అనుగుణంగా అతడు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండేదని అభిప్రాయపడింది. అందులో అరుణ్ కుమార్ మహంత విఫలం అయినందు వల్లే.. ఘోర రైలు ప్రమాదం జరిగిందని, 296 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ప్రమాదానికి మహంతానే ప్రధాన కారకుడని కోర్టు భావిస్తున్నట్లు పేర్కొంది.