మోదీ ఏమైనా పరమాత్ముడా, ఆయన వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది - ఖర్గే సెటైర్లు
No Confidence Motion: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే సెటైర్లు వేశారు.
No Confidence Motion:
అవిశ్వాస తీర్మానంపై చర్చ
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పీచ్ సంచలనమైంది. ఆ తరవాత స్మృతి ఇరానీ, అమిత్ షా గట్టిగా బదులు చెప్పారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశంపై మాట్లాడనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించారు. ఆయనేమైనా భగవంతుడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది..? ఆయనేమైనా పరమాత్ముడా? భగవంతుడేమీ కాదుగా. మా డిమాండ్లను ఆయన ముందే వినిపిస్తాం"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
#WATCH | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...Pradhan Mantri ke aane se kya hone wala hai, kya parmatma hai woh? Yeh koi bhagwan nahi hai"
— ANI (@ANI) August 10, 2023
(Source: Sansad TV) pic.twitter.com/EBZddWW3tu
మల్లికార్జున్ కొడుకు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. ఆయన పార్లమెంట్‌కి వచ్చి గత ప్రభుత్వాలను విమర్శించి వెళ్లిపోవడం తప్ప ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. మణిపూర్‌పై మాట్లాడడానికి ఆయనకు 80 రోజులు పట్టిందా అంటూ ప్రశ్నించారు.
"ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ విక్టిమ్ కార్డ్‌తో విపక్షాలపై విమర్శలు చేస్తారు. గత ప్రభుత్వాలను తప్పు పడతారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తారు. మణిపూర్ అనే పేరు పలకడానికే ఆయనకు 80 రోజుల సమయం పట్టింది. ఆయన మన్ కీ బాత్ ఏంటో ఇవాళ తేలిపోతుంది"
- ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక మంత్రి
#WATCH | When asked about the reply of PM Modi on the no-confidence motion, Karnataka minister Priyank Kharge says “The standard operating procedure will be followed, the PM will play victim card, he’ll blame the previous governments. He’ll invoke Nehru ji, Rajiv Gandhi, Manmohan… pic.twitter.com/nRySADJhOp
— ANI (@ANI) August 10, 2023
ఇప్పటికే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు రాహుల్ గాంధీ. అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ మణిపూర్ అంశంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. మణిపూర్ రాష్ట్రాన్ని దేశంలో భాగంగా మోదీ సర్కార్ చూడడం లేదని విమర్శలు చేశారు. తాను మణిపూర్‌కి వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించానని, ప్రధాని మోదీ మాత్రం ఇప్పటి వరకూ ఆ పని చేయలేదని విమర్శించారు. "ప్రధాని మోదీకి మణిపూర్ మన దేశంలోని భాగం కాదు. ఆ రాష్ట్రాన్ని మోదీ సర్కార్ ముక్కలు చేసింది" అంటూ విరుచుకు పడ్డారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారంటూ తీవ్రంగా విమర్శించారు. మణిపూర్‌లో పర్యటించినప్పుడు చాలా మంది బాధితులను ఓదార్చినట్టు వెల్లడించారు రాహుల్ గాంధీ. కళ్లముందే భర్తను కాల్చి చంపినట్టు ఓ బాధితురాలు తనతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్టు వివరించారు. ప్రధాని మోదీని రావణాసురుడితో పోల్చారు రాహుల్. ఆయన అదానీ, అమిత్‌షా మాటలు తప్ప ఇంకెవరి మాటల్నీ వినిపించుకోరని అన్నారు.