New CJI Justice BR Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం, అరుదైన వ్యక్తిగా గుర్తింపు
CJI Justice BR Gavai Take Oath | జస్టిస్ బీఆర్ గవాయ్ భారతదేశపు 52వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి బౌద్ధుడుగా నిలిచారు.

న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో బుధవారం 52వ సీజేఐ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ బీఆర్ గవాయ్ చేత ప్రమాణం చేయించారు.
సీజేఐగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తాజా ప్రమాణ స్వీకారంతో భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి బౌద్ధుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది నవంబర్ 23న గవాయ్ పదవి విరమణ చేయనున్నారు.
LIVE: Swearing-in-Ceremony of the Chief Justice of India Shri Justice Bhushan Ramkrishna Gavai at Rashtrapati Bhavan https://t.co/KSRP8wDqpz
— President of India (@rashtrapatibhvn) May 14, 2025
2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి
1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు బీఆర్ గవాయ్. ఆయన తండ్రి రామకృష్ణ గవాయ్ రాజ్యసభ మాజీ సభ్యుడు. మహారాష్ట్రలో ప్రముఖ నేత. బీఆర్ గవాయ్ నాగ్‌పూర్ యూనివర్శిటీలో లా డిగ్రీ పొందారు. 25 ఏళ్ల వయసులో 1985 మార్చి 16న న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టారు. వృత్తిలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2003 నవంబరులో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2005 నవంబర్ నెలలో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ముంబై, నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో బీఆర్ గవాయ్ న్యాయమూర్తిగా సేవలందించారు. ఈ క్రమంలో 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలు
దాదాపు గత ఆరేళ్ల కాలంలో ఆయన కొన్ని వందల ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని ఎన్నో రాజ్యాంగ, సివిల్, క్రిమినల్ చట్టాలు, ఆర్బిట్రేషన్, వాణిజ్య వివాదాలు విద్య, పర్యావరణం లాంటి పలు కేసుల విచారణ చేపట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పిటిషన్లను గవాయ్ బెంచ్ విచారిస్తున్న విషయం తెలిసిందే. 51వ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయడం, తన తరువాత బీఆర్ గవాయ్ పేరును సిఫార్సు చేశారు. 52వ సీజేఐగా ఇటీవల నియమితులైన జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.






















