Meghalaya Govt: ప్రధాని మోదీ సభకు అనుమతి నిరాకరణ, జరిపితీరతామన్న బీజేపీ
మేఘాలయ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తురాలోని ఈ స్టేడియంలో ర్యాలీని అనుమతించడం లేదని బీజేపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు.
మేఘాలయ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ కోసం అనుమతిని నిరాకరించింది. పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని తురా వద్ద స్టేడియంలో సభ ఏర్పాటు చేసుకోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల ర్యాలీ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. ఇందుకోసం బీజేపీ మేఘాలయ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అనుమతి నిరాకరించినందుకు సమాధానంగా బీజేపీ ర్యాలీకి అనుమతి కోరుతున్న చోటే పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు, మేఘాలయ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తురాలోని ఈ స్టేడియంలో ర్యాలీని అనుమతించడం లేదని బీజేపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేఘాలయకు రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే కచ్చితంగా ప్రధాని మోదీ ఇక్కడికి వస్తారని, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పారు.
'ప్రధాని మోదీని ఎవరూ ఆపలేరు'
ప్రధాని సభా వేదికను ఇంకా నిర్ధారించకపోయినా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ర్యాలీ జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల జాయింట్ ఇన్‌చార్జి రితురాజ్ సిన్హా ఆదివారం (ఫిబ్రవరి 19) తెలిపారు. ఒక్కసారి మేఘాలయ ప్రజలతో మాట్లాడాలని ప్రధాని నిర్ణయించుకుంటే ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
మేఘాలయ ప్రభుత్వం, బీజేపీ పోటాపోటీ
మేఘాలయలో బీజేపీ సభ తలపెట్టిన ఈ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో ఉంది. పీఏ సంగ్మా స్టేడియం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో, 2022 డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ స్టేడియంను ఘనంగా ప్రారంభించారని బీజేపీ చెబుతోంది. స్టేడియం సిద్ధంగా లేకుంటే ఎందుకు, ఎలా ప్రారంభోత్సవం చేశారని బీజేపీ నేతలు అడుగుతున్నారు.
అమిత్ షా ఫిబ్రవరి 17న ఎన్నికల ర్యాలీ
అంతకుముందు, మేఘాలయ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం (ఫిబ్రవరి 17) రంగసకోనా చేరుకున్నారు. ఈ సమయంలో, ఆయన మమతా బెనర్జీ పార్టీ TMC, రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మాను తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమిత్ షా ర్యాలీకి అప్పుడు జనం భారీగా తరలి రావడంతో మేఘాలయ ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం అయిన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.
2018 ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ రాని మెజారిటీ
మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఈసారి ఎన్‌పీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. టీఎంసీ, యూడీపీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో 21 సీట్లు గెల్చుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 20 స్థానాలు దక్కించుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, ఎన్‌పీపీ పార్టీలు రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.