Manipur Violence: మణిపూర్‌లో దుండగుల ఆగడాలు, భారీగా పోలీసు ఆయుధాల లూటీ
Manipur Violence: మణిపూర్ లో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీగా ఆయుధాలు లూటీ చేశారు.
Manipur Violence: గిరిజనులు, గిరిజనేతురల మధ్య పోరుతో మణిపూర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగూతూనే ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించినా.. మణిపూర్ లో పరిస్థితులు ఏమాత్రం కుదుటపడటం లేదు. హింసతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో తాజాగా మరోసారి భయానక ఘటన వెలుగు చూసింది. దుండగుల ముఠా పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను లూటీ చేసింది. బిష్ణుపూర్ జిల్లా నారన్ సైనాలో ఉన్న 2వ ఇండయా రిజర్వ్ బెటాలియన్ (IRB) ప్రధాన కేంద్రంపై తాజా దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు.
ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 16 9mm పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్లు, 5.56mm ఇన్సాస్ రైఫిళ్లు, ఐదు 5.56mm ఇన్సాస్ LMGలు, ఎక్కువ మొత్తంలో MP5లు, 9mm క్యాలిబర్ 16 పిస్టళ్లు, 7.62mm SLRల 195 తుపాకులు, 21 SMC కార్బైన్లు, మూడు 7.62mm LMG, 4 LMGలు, ఒక MG3 కార్బైన్ GF రైఫిళ్లు, రెండు .22 రైఫిల్స్, మూడు 51mm, ఎనబై ఒకటి 51mm HE బాంబులు, 24 బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, 23 కెవ్లర్ బాడీ ఆర్మర్, 115 బయోనెట్ లు, 16,245 రౌండ్ల మిశ్రమ మందుగుండు సామగ్రినితో పాటు వివిధ తుపాకులకు చెందిన 19 వేల బుల్లెట్లును లూటీ చేసినట్లు బెటాలియన్ కేంద్రం అధికారులు వెల్లడించారు. దుండగులు.. 40 నుంచి 45 వాహనాల్లో మిగతా వారు కాలినడకన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.45 గంటలకు 2వ ఐఆర్బీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ దుండగులు బిష్ణుపూర్ జిల్లాలోని కైరెన్ ఫాబి, తంగలవాయి పోలీసు ఔట్ పోస్టుల నుంచి మరికొన్ని ఆయుధాలు, బుల్లెట్లు లూటీ చేశారు.
Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు
మరోవైపు రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోనూ రెండు ఆయుధ కేంద్రాలపై దాడి చేశారని, ఆయుధాలు లూటీ చేసేందుకు విఫల యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ విధంగా మణిపూర్ రాష్ట్రంలోని 37 ప్రాంతాల్లో సుమారు 5 వేల ఆయుధాలను దుండగులు అపహరించినట్లు అధికారుల అంచనా. వీటిలో ఎల్ఎంజీ, ఎంఎంజీ, ఏకే, ఇన్సాస్, అసాల్ట్ రైఫిల్స్, ఎంపీ 5, స్నైపర్, కార్బైన్ లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
మరో వైపు మణిపూర్ అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలకు గిరిజన నాయకుల వేదిక (ITLF) తలపెట్టిన అంత్యక్రియల యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చురచంద్ పూర్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా ఘర్షణ మొదలైంది. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఖనన ప్రదేశానికి గిరిజనులు ప్రదర్శనగా వెళ్తుండగా భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. గిరిజనులు ప్రతిఘటించడంతో భద్రతా బలగాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలోని కంగ్వాయి, ఫౌగక్చావోలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. దీంతో అంతిమ సంస్కార కార్యక్రమాలకు కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు.