Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి
Manipur Violence: మణిపూర్‌లోని లీథూ గ్రామంలో రెండు తెగల మధ్య కాల్పులు జరిగిన ఘటనలో 13 మంది మృతి చెందారు.
Manipur Violence Firing:
మణిపూర్ హింస..
మణిపూర్‌లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. తెంగ్నౌపాల్‌లో (Tengnoupal Firing) రెండు తెగల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన అస్సాం రైఫిల్స్ (Assam Rifles Operation) ఆపరేషన్ నిర్వహించింది. ఈ కాల్పుల్లో చనిపోయిన 13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. మృతుల వివరాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తమకు సమాచారం అందిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. లీథూ గ్రామంలో ఈ ఘర్షణ జరిగినట్టు తెలిపారు. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలు కనిపించలేదని స్పష్టం చేశారు.
"ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో భద్రతా బలగాలున్నాయి. ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా లీథూ గ్రామంలో 13 మంది మృతదేహాలు కనిపించాయి. ఈ మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. ఈ చనిపోయిన వాళ్లు స్థానికులు కాదు. వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చారు. మరో తెగతో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. పూర్తి స్థాయిలో ఘటనపై విచారణ కొనసాగిస్తాం"
- పోలీసులు
మే 3 నుంచి ఘర్షణలు..
మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గొడవల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవలే ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఈ మధ్యే United National Liberation Force (UNLF)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా మణిపూర్‌లో యాక్టివ్‌గా ఉన్న ఈ మిలిటెంట్ గ్రూప్ తమ ఆయుధాలను కేంద్రానికి అప్పగించింది. ఇకపై మణిపూర్ ప్రశాంతంగానే ఉంటుందని భావించారంతా. కానీ...ఇప్పుడు జరిగిన గొడవతో మళ్లీ అలజడి రేగింది.