శరద్ పవార్ మరో ఉద్దవ్ థాక్రే అవుతారా? మైండ్‌గేమ్‌తో అజిత్‌కి షాకిస్తారా?
Maharashtra NCP Crisis: మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పాలిటిక్స్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి.
Maharashtra NCP Crisis:
పవార్ వర్సెస్ పవార్
మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ శిందే ప్రభుత్వంతో చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా తమదే అసలైన NCP అని, ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ప్రకటించారు. అక్కడి నుంచి రాజకీయాలు మారిపోయాయి. 53 మంది NCP ఎమ్మెల్యేలలో 40 మంది మద్దతు తమకే ఉందని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే..ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరవాత సీన్ మారిపోయింది. ఎంత మంది ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదు. గవర్నర్‌కి ఇచ్చిన లేఖలో మాత్రం తనకు 40 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. సంతకాలు కూడా పెట్టించారు. కానీ...తమకు విషయం ఏంటో చెప్పకుండా హడావుడిగా సంతకాలు పెట్టించుకున్నారని కొందరు ఎమ్మెల్యేలు మండి పడుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ శరద్ పవార్ కానీ అజిత్ పవార్ కానీ తమకు ఇంత మద్దతు ఉందని అధికారికంగా చెప్పలేదు. అయితే...కొందరు నేతలు మాత్రం పరోక్షంగా ట్విటర్ ద్వారా తమ మద్దతు ఎవరికో చెప్పేస్తున్నారు. శరద్ పవార్‌తో కలిసున్న ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అజిత్ పవార్ మాత్రం కేవలం 9 మంది ఎమ్మెల్యేలతోనే కనిపించారు. ఎప్పుడైతే శరద్ పవార్ పర్సనల్‌గా కాల్ చేసి అందరితో మాట్లాడతారో...అప్పుడే ఎవరి వర్గంలో ఎంత మంది ఉన్నారో తేలిపోతుందని స్పష్టం చేస్తున్నారు పలువురు నేతలు.
మద్దతు ఎవరికి..?
అజిత్ పవార్ NCPని చీల్చాలంటే మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతానికి అంత మంది ఆయన వైపు ఉన్నారని చెప్పడానికి లేదు. ఇంత సపోర్ట్ ఉంటేనే ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోడానికి వీలవుతుంది. అంతే కాదు. పార్టీ పేరుని, గుర్తునీ వాడుకునేందుకు అవకాశముంటుంది. అటు శరద్ పవార్ మాత్రం ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. పార్టీని రీబిల్డ్ చేసుకుంటానని ప్రకటించారు. అంతే కాదు. లీగల్‌గా పోరాటం చేసేందుకు అవసరమైన అన్ని దారులనూ వెతుక్కుంటున్నారు. ఇప్పటికే శివసేన విషయంలోనే అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేదు. ఇప్పుడు అదే సమస్య మరో పార్టీ నుంచి ఎదురైంది. ఇప్పుడీ విషయంలో ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది. అయితే..శరద్ పవార్ మాత్రం ఉద్దవ్ థాక్రేలా సైలెంట్‌గా ఉండరని తేల్చి చెబుతున్నారు ఆయన మద్దతుదారులు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు ఏదో ఓ ప్లాన్ చేసే ఉంటారని స్పష్టం చేస్తున్నారు. అజిత్ పవార్ వర్గంలో ఉన్న 9 మంది మీద మాత్రమే చర్యలు తీసుకుని మిగతా వాళ్లను వెనక్కి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. "వాళ్లంతా మా కుటుంబ సభ్యులే. ఎప్పుడు వచ్చినా వెల్‌కమ్ చెబుతాం" అని సుప్రియా సూలే ఇప్పటికే ప్రకటించారు. డైరెక్ట్‌గా సంకేతాలిచ్చారు. ఎవరి నంబర్ ఎంత అని తేలేంత వరకూ ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
Also Read: Rat in Food: రెస్టారెంట్‌లో చికెన్ కర్రీ తినే ముందు జాగ్రత్త, ఎలుకలుంటాయ్ చూసుకోండి - వైరల్ వీడియో