Kolkata Doctor Murder: హత్యాచారం చేసి, బట్టలు ఉతుక్కుని వెళ్లి హాయిగా నిద్రపోయాడు: కోల్‌కతా డాక్టర్ కేసులో సంచలనం
Kolkata Trainee Doctor Murder Case : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడి గురించి పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
Kolkata Trainee Doctor case Updates: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యా నేరంపై అరెస్టయిన వ్యక్తి మొదట తన ఇంటికి తిరిగి వచ్చి హాయిగా నిద్రపోయినట్లు వెల్లడైంది. దీని తరువాత, మరుసటి రోజు ఉదయం అతను సాక్ష్యాలను నాశనం చేయడానికి తన బట్టలు ఉతుకుకున్నాడని ఓ అధికారి సమాచారం ఇచ్చారు. నిందితుడు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అయినా పోలీసులు నిందితుడి బూట్లపై రక్తపు మరకలను గుర్తించారు. ఈ కేసులో నిందితుడు నగరపాలక సంస్థకు చెందిన వాలంటీర్ అని తెలిపారు.
నిందితుడి బూట్లపై రక్తపు మరకలు
కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ, “నేరం చేసిన తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం వరకు నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత, అతను సాక్ష్యాలను నాశనం చేయడానికి హత్య చేసే సమయంలో ధరించిన దుస్తులను ఉతికి వచ్చాడు. తనిఖీల్లో అతని బూట్లు కనిపించాయి. వాటిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఈ నేరంలో ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా అనేదానికి ప్రస్తుతం ఆధారాల్లేవని కమిషనర్ తెలిపారు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ యూనిట్‌తో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కి చెందిన పోలీసు అధికారుల బృందం ఆదివారం ఆసుపత్రిలోని సెమినార్ హాల్ నుండి నమూనాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
నిందితుడు పోలీసులకు ఎలా చిక్కాడు?
పోలీసులు నేరస్తుడి వద్ద బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ను గుర్తించారు. ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్ కారణంగా.. నిందితుడిని చేరుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ఈ కేసులో నిందితుడిని పట్టించిన ప్రధాన సాక్ష్యం ఇదే. ఇది కాకుండా, సంఘటన జరిగిన సమయంలో అతను సీసీటీవీ ఫుటేజీలో కూడా కనిపించాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఇతర ఆధారాలను కూడా సేకరించారు. అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌పై ఇప్పటివరకు అతిపెద్ద సాక్ష్యం దొరికింది. బాధితురాలి గోళ్లలో లభించిన రక్తం, చర్మం నిందితుడు సంజయ్ రాయ్‌కు చెందినవని తేలింది.
కాపాడుకోవడానికి ప్రతిఘటించిన బాధితురాలు
నిందితుడు దాడి చేస్తుండగా బాధితురాలు తనను తాను రక్షించుకునేందుకు ప్రతిఘటించిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ పోరాటంలో నిందితుడి శరీరంపై గీతలు పడ్డాయి. గొంతు నులిమి చంపడం వల్లే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. బాధితురాలి ముఖం, కళ్లు, మెడపై గాయాల గుర్తులున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఉంది. బాధితురాలు కొన్ని నెలల క్రితం నిందితుడితో గొడవపడ్డట్లు తమకు తెలిసిందని పోలీసులు చెప్పారు. సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా బాధితురాలి శరీరంపై గాయాలు సంజయ్ ఒక్కడి వల్లే జరిగాయా లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
పోస్టుమార్టం నివేదిక ఏం చెప్పింది?
బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతున్నట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఎడమ కాలు, మెడ, చేతులు, పెదవులపై గాయాలున్నాయి. డాక్టర్‌ను మొదట హత్య చేసి, ఆపై అత్యాచారం చేసి ఉండొచ్చని సందర్భోచిత ఆధారాలు కూడా సూచిస్తున్నాయని మరో పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు డ్యూటీలో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నామని, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కూడా క్రైం సీన్‌ను రీక్రియేట్ చేశారు.
న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన
శుక్రవారం ఉదయం, ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో అత్యాచారం చేసి హత్య చేసిన ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం లభ్యమైంది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం మూడో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు నిలిచిపోయాయి.
Also Read: ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, ఆపై హత్య - శరీరమంతా లోతైన గాయాలు
భారీగా పోలీసు బలగాల మోహరింపు
కోల్‌కతా పోలీసులు ఆదివారం ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. సరైన గుర్తింపు లేకుండా ఎవరినీ ఆసుపత్రి ప్రాంగణంలోకి అనుమతించబోమని, ఆసుపత్రిలోని ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి భద్రత కల్పిస్తామని అధికారి తెలిపారు. ఎమర్జెన్సీ వార్డులో కాంట్రాక్ట్‌పై నియమించిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించనందుకు ఆస్పత్రి అధికారులు వారిని విధుల నుంచి తొలగించినట్లు మరో అధికారి తెలిపారు.
మరణశిక్ష విధించాలని సీఎం డిమాండ్
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గోయల్‌తో సమావేశం తర్వాత, అన్ని అత్యవసర, నాన్-ఎమర్జెన్సీ సేవల్లో ఆటంకం ఏర్పడుతుందని జూనియర్ డాక్టర్ చెప్పారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.