Ramnath Kovind: జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కీలక సిఫార్సులు ఇవే - త్వరలో కేంద్రానికి నివేదిక
Jamili Elections: జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ త్వరలో నివేదికను కేంద్రానికి అందించనుంది. ఇందులో పలు సిఫార్సులు చేశారు.
Modi Government: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ మార్పులకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వరంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత కొద్ది నెలలుగా జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేపడుతుండగా.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందచేయనుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు
జమిలీ ఎన్నికలు సాధ్యమా? కాదా? ఒకవేళ నిర్వహించాలనుకుంటే ఎలాంటి రాజ్యంగ సవరణలు చేయాలి? అనే అంశాలను కోవింద్ కమిటీ పరిశీలించింది. వీటిపై ఒక నివేదికను తయారుచేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో పలు సిఫార్సులు చేసింది. 2029 నాటికి జమిలీ ఎన్నికలు జరపాలంటే ఎలాంటి మార్పులు చేయాలి? రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పొడిగించాలంటే ఏం చేయాలి? అనే దానిపై కేంద్రానికి పలు సూచనలు చేయనున్నారు. అలాగే లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలన్నింటికీ ఉమ్మడి ఓటు జాబితా ఉండాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించడానికి ఆర్టికల్ 356, అసెంబ్లీల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 174, లోక్‌సభ రద్దుపై ఆర్టికల్ 85, పార్లమెంట్ సభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 83తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలో పలు మార్పులు చేయాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
న్యాయ కమిషన్ పలు సూచనలు
ఇప్పటికే జమిలీ ఎన్నికలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ ఆధ్వర్యంలోని న్యాయ కమిషన్ కేంద్రానికి పలు సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యంగంలో కొత్త చాప్టర్‌ను చేర్చాలని సిఫార్సు చేసింది. న్యాయ్ కమిషన్ నివేదికను ఇప్పటికే కేంద్రం పరిశీలించింది. మరింతగా దీనిపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ పార్టీలతో పాటు జడ్జీలు, మేధావులతో సమావేశమైంది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి రిపోర్ట్‌ను రెడీ చేసింది. మరికొద్దిరోజుల్లో ఈ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనుంది. ఈ నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికలపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. 2029 మే లేదా జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం చూస్తోంది.
ఈసీ ముందు సవాళ్లు
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఎన్నికల సంఘం ముందు అనేక సవాళ్లు ఉంటాయి. ఈవీఎంలు, సిబ్బంది, భద్రత వంటివి కష్టతరంగా మారతాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంల కోసం ప్రతీ 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఈసీ అంచనా వేసింది. అలాగే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పర్యవేక్షణ కూడా కష్టమవుతుంది. దీంతో వీటిపై ఈసీ కూడా పరిశీలన చేపడుతోంది. రామ్‌నాథ్ కమిటీ ఈసీకి ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది కీలకంగా మారింది.