మహిళల సేఫ్‌టీ కోసం బస్‌లలో ప్యానిక్ బటన్స్, ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka: కర్ణాటకలో అన్ని ప్రభుత్వ బస్‌లలో మహిళల భద్రత కోసం ప్యానిక్ బటన్స్‌ని ఏర్పాటు చేయనున్నారు.
Karnataka:
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం..
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బస్‌లలో "Panic Buttons"ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడిచే అన్ని బస్‌లలోనూ ఈ ప్యానిక్ బటన్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.30.74 కోట్లు కేటాయించింది. ఈ నిధులతోనే వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి వీటిని ఆపరేట్ చేయనున్నారు. ప్రయాణికుల వెయిటింగ్ టైమ్‌ని తగ్గించేందుకూ ఇది ఉపయోగపడనుంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ స్పందించారు. వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు ప్యానిక్ బటన్స్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయని వివరించారు. ప్రయాణికులు తామెక్కడున్నారో తెలుసుకునే వెసులుబాటుతో పాటు...బస్‌లకు సంబంధించిన వెయిటింగ్ టైమ్ కూడా తెలుస్తుందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్యానిక్ బటన్స్ ఎనేబుల్ అవుతాయి. వాటిని ప్రెస్ చేసిన వెంటనే...కంట్రోల్ రూమ్‌కి అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. అప్పటికప్పుడు ఆ లొకేషన్‌కి రెస్క్యూ టీమ్‌ని పంపించేందుకు వీలవుతుంది. మొత్తంగా రూ.34 కోట్ల వరకూ ఇందుకోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉచిత బస్ సౌకర్యం..
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది...మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. "శక్తి యోజనే" (Shakti Yojane) పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జూన్ 11న ఈ పథకాన్ని లాంఛ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ బస్‌లలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ శక్తి స్కీమ్ కేవలం ఆర్డినరీ బస్‌లకు (BMTC) మాత్రమే వర్తించనుంది. వేరే రాష్ట్రానికి ట్రావెల్ చేసే వాళ్లకు ఈ స్కీమ్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. KSRTC, KKRTCకి చెందిన బస్‌లలో 50% సీట్లు పురుషులకే కేటాయించింది.
నిధులు లేవు..
కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కి వాటిని అమలు చేయడం కత్తిమీద సామైంది. నిధులు చాలక ఇబ్బందులు పడుతోంది. కొంత మంది ఎమ్మెల్యేల అసహనానికీ ఇదే కారణం. అందుకే...ముఖ్యమంత్రి లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. అదంతా ఫేక్ అని కాంగ్రెస్ కొట్టి పారేసింది. అయితే...ఇప్పుడు ప్రభుత్వం హామీలు నెరవేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. కానీ...ఈ సారి మాత్రం ఆయన వ్యాఖ్యల తీరు మారిపోయింది. ఈ సంవత్సరం ఉచిత హామీలను అమలు చేయడం కష్టమే అని స్పష్టం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతోందని అందుకే ఆ హామీలు నెరవేర్చడం కుదరడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గానూ ఉన్న డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ ఆ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యేలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారు డీకే శివకుమార్. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్న అసహనంతో ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. అంతే కాదు. కొంతమంది మంత్రులు తమని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Also Read: దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాం, లోక్‌సభలో అమిత్‌షా కీలక ప్రకటన