MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Karnataka MLA: ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళిత స్వామీజీకి ఓ వేదికపై ఆహారం తినిపించారు. అంతేకాక, అతని నోటిలో పెట్టిన తర్వాత స్వామీజి కాస్త నమిలిన ఆహారాన్ని నోటి నుంచి తీసి ఎమ్మెల్యే తిన్నారు.
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు జమీర్ అహ్మద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒక దళిత స్వామీజీ విషయంలో వింతగా ప్రవర్తించారు. కొందరు దీనిని దారుణంగా పేర్కొంటుండగా, మరికొందరు అంటరానితనంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశారని అన్నారు.
కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళిత స్వామీజీకి ఓ వేదికపై ఆహారం తినిపించారు. అంతేకాక, అతని నోటిలో పెట్టిన తర్వాత స్వామీజి కాస్త నమిలిన ఆహారాన్ని నోటి నుంచి తీసి ఎమ్మెల్యే తిన్నారు. ఇది చూసే వారికి కాస్త జుగుప్సగా అనిపించింది. పాదరాయణపూర్‌లోని అల్ అజర్ ఫౌండేషన్ పాఠశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాద్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వేదికపైనే ఎమ్మెల్యే జమీర్ దళిత స్వామీజీకి అన్నం తినిపించారు.
కులానికి, మతానికి మిగిలేది మానవత్వమే అని ఎమ్మెల్యే అన్నారు. మనమంతా ఒకే జాతి. మనిషిగా జీవించడమే నిజమైన మతం. మానవ సంబంధాలకు కులం, మతం ఎప్పుడూ అడ్డుకావు. మనమందరం అన్నా దమ్ముల్లా జీవించాలి.’’ అని ఎమ్మెల్యే అహ్మద్ జమీర్ ఖాన్ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దళితుడు వంట చేయడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో, జమీర్ అహ్మద్ ఖాన్ దళిత స్వామీజీ నాగరాజ్‌ను సమర్థించారు. మేము మిగిలిపోయిన వాటిని తినడం ద్వారా అంటరానితనానికి వ్యతిరేకతను చాటామని అన్నారు. మొత్తానికి ఈ చర్య అధికార, విపక్షాల నేతల్లోనే కాక దేశమంతా చర్చకు దారితీస్తోంది.
ಜಾತಿ, ಧರ್ಮಗಳೆಲ್ಲವನ್ನೂ ಮೀರಿದ್ದು ಮಾನವೀಯತೆ. ನಮ್ಮ ನಡುವಿನ ಮನುಷ್ಯ ಸಂಬಂಧಗಳಿಗೆ ಜಾತಿ, ಧರ್ಮಗಳು ಎಂದಿಗೂ ಅಡ್ಡಬರಬಾರದು.
— B Z Zameer Ahmed Khan (@BZZameerAhmedK) May 22, 2022
ನಾನು, ನೀವು, ಎಲ್ಲರೂ ಮನುಷ್ಯ ಜಾತಿ.
ಮನುಷ್ಯನಾಗಿ ಬಾಳುವುದೇ ನಿಜವಾದ ಧರ್ಮ.#ಸಾಮರಸ್ಯ #ಮಾನವೀಯತೆ pic.twitter.com/3qVCvA6XuO
‘‘మానవత్వం అన్ని కులాలకు, మతాలకు అతీతం. మన మధ్య మానవ సంబంధాలకు కులం, మతం ఎప్పుడూ అడ్డురాకూడదు. నేనూ, నువ్వు, అందరిదీ ఒక కులం. మనిషిగా జీవించడమే నిజమైన మతం.’’ అని ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఆ వీడియోతో పాటు ట్వీట్ చేశారు.
హుబ్లీ అల్లర్లలో నిందితుల కుటుంబానికి ఆహార కిట్లు, విరాళాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జమీర్‌పై ఇటీవలే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రి అశ్వత్థనారాయణ, సీఎం రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య సహా పలువురు వ్యతిరేకించారు. దీనిపై జమీర్ అహ్మద్ ఖాన్ ఇటీవలే స్పందించారు. ‘‘నేను ఈనెల 17న బెంగళూరు నుంచి మతపరమైన యాత్ర కోసం మక్కాకు వెళ్లాను. ఇప్పుడు నాపై చేస్తున్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఆరోపణలన్నీ నిజం కాదు’’ అని అన్నారు.