Nandini Milk Prices: మిల్క్ రేట్ కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం- మరోసారి తెరపైకి నందినీ పాల అంశం
కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలోని నడుస్తున్న ప్రముఖ బ్రాండ్ నందిని పాల ధర లీటరుకు ₹3 పెంపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలోని నడుస్తున్న ప్రముఖ బ్రాండ్ నందిని పాల ధర లీటరుకు ₹3 పెంపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాల ఉత్పత్తిదారుల డిమాండ్ల మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పాల ధరల పెంపును ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సమర్థించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటక తక్కువ ధరకు పాలను విక్రయిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పాల ధరలు ఎక్కువగా ఉన్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం రూ.39 ధర ఉండే టోన్డ్ పాలు ఇప్పుడు లీటరుకు రూ.42కు చేరుతుందన్నారు. మిగిలిన చోట్ల, లీటరుకు రూ.54 నుంచి రూ.56 వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో లీటరు ధర రూ.44గా ఉన్నట్లు వివరించారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం సీఎం సిద్దారామయ్య వాదనను సమర్థిస్తూ మాట్లాడారు. డీకే స్పందిస్తూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారులను, రైతులను ఆదుకునేందుకు ధరల పెంపు అవసరమని అభిప్రాయపడ్డారు. తాము పాల ఉత్పత్తిదారులకు కనీస ధర, కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని భావించామని, అందులో భాగంగానే పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పాడి రైతులు తాము ఉత్పత్తి చేస్తున్న పాలకు అతి తక్కువ ధరకు పొందుతున్నారని అన్నారు. దేశం మొత్తం మీద టోన్డ్ మిల్క్ లీటరు రూ.56 ఉండగా కర్ణాటకలో మాత్రం రూ.39 ఉందన్నారు. తక్కువ ధరలతో నష్టపోతున్న రాష్ట్ర పాడి రైతులను ఆదుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ నేపథ్యంలోనే పాల ధరలను మూడు రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
బీజేపీ హయాంలో చివరి సారిగా 2022 నవంబర్‌లో పాల ధరలను పెంచారు. కేఎంఎఫ్ మూడు రూపాయలు ప్రతిపాదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై జోక్యం చేసుకోవడంతో కేఎంఎఫ్ కొంచెం వెనక్కితగ్గింది. లీటరుకు రూ.2 పెంచింది. 2022లో ధర పెరిగినప్పటికీ, కర్ణాటకలో నందిని పాల విక్రయ ధర ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. నందిని పాలు లీటరుకు రూ. 39 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రైవేట్ సంస్థలు తమ పాలను లీటరుకు రూ.48 నుంచి రూ.52 వరకు విక్రయిస్తున్నాయని సీనియర్ KMF అధికారి తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని వివాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. బెంగుళూరులో అమూల్ పాలు, పెరుగు విక్రయించడానికి బీజేపీ అనుమతించింది. దీంతో అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్, కన్నడ అనుకూల సంఘాలతో ఆందోళనలకు దిగాయి. అమూల్‌కు అనుమతులు ఇవ్వడం ద్వారా కేఎంఎఫ్ సంస్థను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నాయని మండిపడ్డాయి. తాజాగా నందిని పాల ధరల పెంపుపై బీజేపీ ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial