NewsClick: న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు, చైనా నుంచి నిధుల ఆరోపణల నేపథ్యంలో దాడులు
NewsClick: న్యూస్ క్లిక్ న్యూస్ పోర్టల్ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ వస్తున్న ఆరోపణ నేపథ్యంలో పోలీసులు సోదాలు చేపట్టారు.
NewsClick: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. న్యూస్ క్లిక్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ కు చైనా నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. న్యూస్ క్లిక్ జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. చైనా నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విభాగం అధికారులు స్థానికంగా ఉన్న న్యూస్ క్లిక్ ఆఫీసుతో పాటు.. అందులో పని చేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్ సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. వారి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని న్యూస్‌క్లిక్ జర్నలిస్టు అయిన అభిసార్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పుకొచ్చారు. పోలీసులు తన ఇంటికి వచ్చారని, తన ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు తన పోస్టులో వెల్లడించారు. కొంత మంది జర్నలిస్టులను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారని మరికొందరు ఆరోపించారు.
Delhi police landed at my home. Taking away my laptop and Phone...
— Abhisar Sharma (@abhisar_sharma) October 3, 2023
రెండు సంవత్సరాల క్రితం 2021 లోనూ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలో తేలింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరఫున న్యూస్ క్లిక్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. నెవిల్లే చైనా కమ్యూనిస్టు పార్టీ తో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. న్యూస్ క్లిక్ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనం ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపింది. న్యూస్ క్లిక్ కు చైనా నుంచి అందుతున్న నిధుల వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది.
VIDEO | Delhi Police Special Cell conducts raids at several locations linked to news portal 'NewsClick' in Delhi-NCR.
— Press Trust of India (@PTI_News) October 3, 2023
NewsClick is alleged to have received dubious funds to spread Chinese propaganda. The allegation was levelled against the portal following a report in the New… pic.twitter.com/xn8AeoY2NI
జూన్ 21, 2021న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి న్యూస్ క్లిక్ పై, పుర్కాయస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వరల్డ్ వైడ్ మీడియా హోల్డింగ్స్ నుంచి న్యూస్‌క్లిక్ కు రూ.9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. విదేశాల నుంచి వచ్చిన డబ్బుకు సంబంధించి న్యూస్ క్లిక్ సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
The Press Club of India is deeply concerned about the multiple raids conducted on the houses of journalists and writers associated with #Newsclick.
— Press Club of India (@PCITweets) October 3, 2023
We are monitoring the developments and will be releasing a detailed statement.