Joint Oppn Meet: బెంగళూరులో విపక్షాల కీలక భేటీ, ఈసారి వ్యూహాలు ఫైనల్ అయిపోతాయా?
Joint Oppn Meet: బెంగళూరులో విపక్షాలు రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నాయి.
Joint Oppn Meet:
రెండ్రోజుల సమావేశాలు..
మోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు సమావేశమై 2024లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఆయా పార్టీల కీలక నేతలు. గతంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో పట్నాలో కీలక సమావేశం జరిగింది. ఇప్పుడు బెంగళూరు ఇందుకు కేంద్రంగా మారింది. రెండ్రోజుల ఈ పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. మహారాష్ట్రలో NCPలో చీలికలు వచ్చిన తరవాత ఈ మీటింగ్ జరుగుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అదీ కాకుండా ఇటీవలే బెంగాల్‌లోని పంచాయతీ ఎన్నికల్లో దారుణమైన హింస చెలరేగింది. ఆ అంశమూ ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP),తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ, రాష్ట్రీయ జనతా దళ్ (RJD),జనతా దళ్ (యునైటెడ్) (JDU), పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ భేటీకి నేతృత్వం వహించనున్నారు. జూన్ 23న పట్నాలో జరిగిన భేటీకి దాదాపు 15 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సారి దాదాపు 26 పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అందరికీ స్వాగతం పలికి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అప్పటి నుంచి చర్చలు మొదలవుతాయి. ఆ తరవాత రేపు (జులై 18) మరో రౌండ్ చర్చలు జరుగుతాయి. బీజేపీని ఎదుర్కోడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో ఈ సమావేశంలో ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సమావేశాలకు హాజరవుతారు.
#WATCH | The second join opposition meeting to begin in Bengaluru, Karnataka today. Posters of Opposition leaders, including AAP's national convener and Delhi CM Arvind Kejriwal, put up at the venue. pic.twitter.com/Vb0PWiRcCf
— ANI (@ANI) July 17, 2023
వ్యూహాలేంటి..?
పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 2024లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై యుద్ధం చేసేందుకు ఏ అస్త్రాలు వాడాలు అని చర్చించుకున్నారు. కానీ...ఆ తరవాత పలు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్, ఆప్ తలో వాదన వినిపించాయి. ఈ విషయంలో రెండు పార్టీలు దూరం పాటించాయి. అయితే ఇప్పుడు ఈ విభేదాలు పక్కన పెట్టి కలిసిపోయాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆమ్‌ఆద్మీ పార్టీకి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆప్ స్వాగతించింది. విపక్షాలతో పాటు కలిసి పోరాటం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింస విషయంలో కాంగ్రెస్, టీఎమ్‌సీకి సయోధ్య కుదురుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. పలు సందర్భాల్లో కాంగ్రెస్ వైఖరితో విభేదించారు మమతా బెనర్జీ. ఈసారి వీటిని కూడా ఓ దారికి తీసుకొచ్చి మేమంతా ఒక్కటే అనే సంకేతాలిచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల కర్ణాటకలో గెలవడం వల్ల ఈ పార్టీపై విపక్షాలకు కాస్త నమ్మకం కూడా ఏర్పడింది. కలిసికట్టుగా పోరాడితే బీజేపీ దూకుడుని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే వీలైనంత వరకూ విభేదాలు పక్కన పెట్టి ఒక్కటవ్వాలని చూస్తున్నాయి. బీజేపీపై డెరెక్ట్ వార్‌ని ప్రకటించిన BRS మాత్రం ఈ విపక్షాల భేటీకి దూరంగా ఉంటోంది.