ISRO SpaDeX Docking Mission : డాకింగ్ ప్రక్రియపై ఇస్రో కీలక ప్రకటన - కేవలం 3 మీటర్ల దూరంలో శాటిలైట్లు
ISRO SpaDeX Docking Mission : ఇస్రో డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్‌ను ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ISRO SpaDeX Docking Mission : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో మరో రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియలో ఇప్పుడు ఇస్రో మరో ముందడుగు వేసింది. భారత స్పేడెక్స్ ఉపగ్రహాలు ఈ రోజు (జనవరి 12) మరింత చేరువయ్యాయి. నిన్న(జనవరి 11)న వాటి మధ్య దూరం 230 మీటర్లుండగా.. ఈ రోజు ఆ దూరం 15 మీటర్లకు చేరుకుంది. వీటిని మరింత చేరువకు అంటే రెండు శాటిలైట్లను 3మీటర్ల దగ్గరకు తీసుకువచ్చి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది ఇస్రో. డేటాను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే డాకింగ్ ప్రాసెస్ మొదలుపెడతామని ఈ సందర్భంగా ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతానికి శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, అన్ని సెన్సర్ల పనితీరును విశ్లేషిస్తున్నామని చెప్పుకొచ్చింది.
డాకింగ్ ప్రక్రియపై ఇస్రో ట్వీట్
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇస్రో.. ఈ డాకింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని అందించింది. "ప్రస్తుతం SD01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసింది. తర్వాత ఈ రెండు శాటిలైట్లను సురక్షితమైన దూరానికి తరలించాం. డేటాను విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతాం" అని ఇస్రో ట్వీట్ ద్వారా వెల్లడించింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 12, 2025
A trial attempt to reach up to 15 m and further to 3 m is done.
Moving back spacecrafts to safe distance
The docking process will be done after analysing data further.
Stay tuned for updates.#SpaDeX #ISRO
అంతకు ముందు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. రెండు ఉపగ్రహాల షేక్ హ్యాండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలు మంచి స్థితిలో ఉన్నాయని చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఇస్రో పంచుకుంది. "ప్రస్తుతం SD01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య దూరం 15 మీటర్ల మాత్రమే ఉంది. వాటి మధ్య మంచి ఉత్తేజకరమైన షేక్ హ్యాండ్ కోసం మనం కేవలం 50 అడుగుల దూరంలో ఉన్నాం. అవి రెండూ పరస్పరం స్టన్నింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాయి" అని ఇస్రో రాసుకొచ్చింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 12, 2025
SpaDeX satellites holding position at 15m, capturing stunning photos and videos of each other! 🛰️🛰️
#SPADEX #ISRO pic.twitter.com/RICiEVP6qB
డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ స్పేస్
ఇస్రో డిసెంబర్ 30న ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు అవసరమైన డాకింగ్ ప్రక్రియపై పట్టు సాధించే ఉద్దేశంతో ఈ మిషన్ ను చేపట్టింది. ఈ 2 ఉపగ్రహాలను భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. కాగా ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు మాత్రమే కావడం చెప్పుకోదగిన విషయం. అయితే ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్) ఎప్పుడు చేపడతామన్నది మాత్రం ఇస్రో వెల్లడించలేదు. దీన్ని జనవరి 7,9 తేదీల్లో నిర్వహిస్తామని మొదట్లో ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత దాన్ని ఇస్రో వాయిదా వేసింది. ఈ స్పేడెక్స్ ప్రయోగం గనక విజయవంతం అయితే, ప్రపంచంలో ఈ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

