Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రాకేష్ జున్‌జున్‌వాలా మరణవార్తతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇటీవలే సొంతంగా ఆయన విమానయాన సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Rakesh Jhunjhunwala Death: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏళ్లు. అతన్ని వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆయన మరణవార్తతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇటీవలే సొంతంగా ఆయన విమానయాన సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని పేరు ఆకాశ ఎయిర్. అలాంటి ఈ సమయంలో ఆయన మరణ వార్త రావడం అందర్నీ కలచివేస్తోంది.
ముంబయిలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆదివారం (ఆగస్టు 14) ఉదయం 6.45 గంటలకు రాజేష్ జున్‌జున్‌వాలా తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం ఈ ఆస్పత్రిలో చేరారు. జున్‌జున్‌వాలా మరణానికి బహుళ అవయవ వైఫల్యమే కారణమని చెబుతున్నారు. అతడిని కాపాడేందుకు వైద్యుల బృందం నిరంతరం ప్రయత్నించినా కానీ సఫలం కాలేదు. నిన్న సాయంత్రం ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా పేరు
ఆయన ఇటీవలే ప్రారంభించిన ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థ ఈ నెల 7న తొలి విమాన సర్వీసును ప్రారంభించింది. ఆయన 1985లో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. క్రమంగా స్టాక్ మార్కెట్ లో ఒక దిగ్గజ వ్యక్తిగా ఎదిగారు. స్టాక్ మార్కెట్ యొక్క బిగ్ బుల్ గా రాకేశ్ జున్‌జున్ వాలాను పిలుస్తుంటారు.
రాకేష్ ఝున్‌జున్‌వాలా కాలేజీ రోజుల నుంచే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ఒకసారి రాకేష్ జున్‌జున్‌వాలా మొదట్లో తాను $100 పెట్టుబడి పెట్టానని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు సెన్సెక్స్ సూచీ 150 పాయింట్ల వద్ద ఉండగా, ఇప్పుడు 60 వేల స్థాయిలో ట్రేడవుతోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా తాజా నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు. రాకేష్ జున్‌జున్‌వాలా తన సొంత స్టాక్ ట్రేడింగ్ కంపెనీ రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు యజమాని కూడా. టైటాన్, స్టార్ హెల్త్, టాటా మోటార్స్, మెట్రో బ్రాండ్ల వంటి స్టాక్‌లలో రాకేశ్ జున్‌జున్ వాలా అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నారు.
ప్రధాని మోదీ సంతాపం
బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్ వాలా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన ట్విటర్ లో స్పందిస్తూ ‘'రాకేష్ జున్‌జున్‌వాలా పరిపూర్ణమైన వ్యక్తి, ఎంతో ఆచరణాత్మక వ్యక్తి. ఆయన ఆర్థిక ప్రపంచానికి చెరగని సహకారాన్ని అందించారు. ఆయన భారతదేశ పురోగతి గురించి చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపక CEO దీపక్ షెనాయ్ ట్వీట్ చేస్తూ.. ‘'చాలా మందికి ఆయన స్ఫూర్తిదాయకమైన ఒక వాణిజ్య పెట్టుబడిదారు. గొప్ప వ్యక్తి. ఆయన్ను ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.’’ అని ట్వీట్ చేశారు.