(Source: ECI/ABP News/ABP Majha)
Indigo Flight In Karachi: హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ - వెంటనే మరో విమానం కరాచీకి
‘‘షార్జా-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం వల్ల కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరొక విమానాన్ని కరాచీకి పంపుతున్నాము.’’ అని ఇండిగో ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసరంగా దించారు. విమానంలో సాంకేతిక లోపం ఉందని పైలట్ నివేదించడంతో, దానిని కరాచీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అక్కడ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించి నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, అందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆలోపు పాకిస్థాన్ లో ఉన్న ప్రయాణికుల్ని ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కరాచీకి మరో విమానాన్ని పంపాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మరో విమానాన్ని కరాచీకి పంపింది.
మరో విమానం కరాచీకి..
దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందిస్తూ ‘‘షార్జా-హైదరాబాద్ విమాన పైలట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు మరొక విమానాన్ని కరాచీకి పంపుతున్నాము.’’ అని ప్రకటన విడుదల చేసింది.
గత రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానయాన సంస్థ ఇది. అంతకుముందు జూలై 5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
After the pilot of the Sharjah-Hyderabad flight observed a technical defect in the aircraft, as a precaution the aircraft was diverted to Karachi, Pakistan. An additional flight is being sent to Karachi to fly the passengers to Hyderabad: IndiGo airlines
— ANI (@ANI) July 17, 2022
జులై 5న న్యూఢిల్లీ నుండి దుబాయ్‌కి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా కరాచీ విమానాశ్రయంలో ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ, “జులై 5, 2022న, స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ SG-11 (ఢిల్లీ-దుబాయ్) ఇండికేటర్ లైట్ సరిగా పని చేయకపోవడంతో కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.’’ అని పేర్కొన్నారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్
ఇదే వారంలో గత బుధవారం ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం కూడా కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇండిగో విమానం నంబర్ 6E2615 ఇంఫాల్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ అక్కడ ప్రతికూల వాతావరణం కారణంగా, ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దాని కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. విమానంలో ఇంధనం కూడా అయిపోనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 141 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత జూలై 6న, ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన రాయ్‌పూర్-ఇండోర్ విమానంలో ప్రమాదం తలెత్తిన సంగతి తెలిసిందే. A320 విమానం గమ్యస్థానంలో దిగిన తర్వాత దాని క్యాబిన్ నుండి పొగలు కమ్ముకోవడాన్ని సిబ్బంది గమనించారు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారని తెలిపారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోంది.