Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!
Independence Day 2022: భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా త్రివర్ణ శోభితంగా మారింది. నేలపైనే కాకుండా అంతరిక్షంలోనూ, భూమికి 30 కిలోమీటర్లపై జాతీయ జెండా ఎగురింది.
Independence Day 2022: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వాడవాడలా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయినవేళ ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపుతో ఇంటంట మువ్వన్నెల జెండా ఎగిరింది. 75 ఏళ్లు పూర్తై వజ్రోత్సవాలు చేసుకుంటున్న వేళ.. అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. భూ గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో భారతీయ జాతీయ జెండా ఎగిరింది. స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ జాతీయ పతాకాన్ని అంతరిక్షంలో ఆవిష్కరించింది. యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సంస్థ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ.. హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా స్పేష్ కిడ్జ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
1,06,000 అడుగుల ఎత్తులో రెపరెపలు..
భూమి నుంచి దాదాపు 1,06,000 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది స్పేస్ కిడ్జ్ సంస్థ. బెలూన్‌లో జాతీయ జెండాను పంపించి. రోదసిలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారు చేయడంతోపాటు, పిల్లల్లో అంతరిక్షంపై అవగాహన పెంచేందుకు స్పేస్ కిడ్జ్ సంస్థ కృషి చేస్తోంది. సరిహద్దులు లేని ప్రపంచం కోసం అవగాహన కల్పిస్తుంది స్పేస్ కిడ్జ్. ఇటీవలే లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఈ స్పేస్ కిడ్జ్ సంస్థ. ఆజాదీ సాట్ పేరుతో దేశంలోని 750 మంది బాలికలతో 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది ఈ సంస్థ. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ ప్రయోగం విఫలమైంది.
Celebrating 75 Years of Independence by unfurling the Indian Flag @ 30 km in Near Space.@PMOIndia @narendramodi @DrJitendraSingh@isro @INSPACeIND@mygovindia#AzadiKaAmritMahotsov#HarGharTiranga pic.twitter.com/4ZIJMdSZE6
— Space Kidz India (@SpaceKidzIndia) August 14, 2022
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ..
75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షం నుంచి కూడా మెసేజ్‌లు వస్తున్నాయి. అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పని చేస్తున్న వ్యోమగామి సమంతా క్రిస్టో ఫోరెట్టి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్‌కు 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏనాటి నుంచో నాసా, ఇస్రో మధ్య మంచి సహకారం ఉందని వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి తెలిపారు.
5 కోట్ల సెల్పీలతో ఏకత్వం..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి దేశ పౌరులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునివ్వగా.. పంద్రాగస్టు వేళ ఇంటింటా జాతీయ పతాకాలు ఎగుర వేశారు. 5 కోట్ల మందికి పైగా త్రివర్ణ పతకంతో సెల్ఫీ దిగి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇదో అద్భుతమైన విజయంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రికార్డును సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ విజయం భారత దేశ ఐక్యత మరియు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని సాంస్కృతిక శాఖ పేర్కొంది.