India Pakistan Attack News: సరిహద్దు వెంబడి పాక్ దళాల మోహరింపు- భారత దళాలు హై అలర్ట్
India Pakistan Attack News: పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోంది. గుణపాఠం చెబుతున్నా వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు పాకిస్థాన్. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

India Pakistan Attack News: సరిహద్దు ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరిస్తున్నట్టు గమనించామని భారత్ ప్రకటించింది. శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పశ్చిమ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై మీడియాకు వివరించారు.
"ఈ దాడి ఉద్రిక్తతలను మరింత పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. భారత సాయుధ దళాలు దేనికైనా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే శత్రుదేశం చేస్తున్న కుట్రలను ఛేదించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులమే. ఉద్రిక్తతలను నివారించడానికి భారత సాయుధ దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయి.."
శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని అనేక వైమానిక స్థావరాలపై హై-స్పీడ్ క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది. ఆసుపత్రులు, పాఠశాలలను కూడా లక్ష్యంగా చేసుకుంది. పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ నిరంతర దాడిని కొనసాగిస్తోంది. ఉధంపూర్, పఠాన్‌కోట్, భుజ్, భటిండాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
"ఉధంపూర్, ఆదంపూర్, పఠాన్‌కోట్, భుజ్‌లోని భారత వైమానిక దళ స్టేషన్లలో సిబ్బంది, పరికరాలకు పరిమిత నష్టం కలిగింది" అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. "కానీ పాకిస్తాన్ చర్యలకు తగిన సమాధానం ఇచ్చాం" అని కల్నల్ ఖురేషి తెలిపారు.
"పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దులపై నిరంతరం దాడి చేస్తోంది; భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలు, ఫైటర్ జెట్‌లను ఉపయోగించింది. భారత్ వాటిని డీ యాక్టివేట్ చేసింది. పాకిస్తాన్ 26 కంటే ఎక్కువ ప్రాంతాల్లోకి చొరబాటుకు ప్రయత్నించింది. ఉధంపూర్, భుజ్, పఠాన్‌కోట్, భటిండాలోని వైమానిక దళ స్థావరాల్లో స్వల్ప డ్యామేజ్ జరిగింది." అని ఆమె చెప్పారు.
పాకిస్తాన్ చర్యలకు ప్రతిస్పందనగా, భారత్ కూడా రియాక్ట్ అయినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో రాత్రిపూట డ్రోన్ దాడులను పాకిస్తాన్ ప్రారంభించింది, సైనిక, పౌరు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం రాత్రి ప్రారంభమై శనివారం తెల్లవారుజామున వరకు దాడులు కొనసాగించింది. దీనికి ప్రతిగా భారత్ చేసిన దాడులు ఆ దేశంలో ప్రకంపనలు పుట్టించాయి. భారత దళాల రియాక్షన్‌తో పాకిస్తాన్ ఉన్నత స్థాయి సమీక్షకు దారితీసింది.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, జమ్మూ, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని మొత్తం 26 ప్రదేశాలు వైమానిక దాడికి గురయ్యాయి. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల్లో బారాముల్లా, శ్రీనగర్, పఠాన్‌కోట్, జైసల్మేర్ భుజ్ వంటి కీలక పట్టణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కీలకమైన సైనిక స్థావరాలు. ఈ ప్రాంతాల్లో చాలా వరకు, రాత్రిపూట వైమానిక దాడుల సైరన్లు మోగగా, విద్యుత్ సరఫరా నిలిపేశారు.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో డ్రోన్ పడటంతో ఒక కుటుంబంలోని సభ్యులు గాయపడ్డారు. డ్రోన్ సైనికేతర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి దాడుల తర్వాత, శ్రీనగర్ నివాసితులు పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నట్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులోకి వచ్చినప్పుడు లైట్స్ చూసినట్లు చెబుతున్నారు. ప్రజలంతా లైట్లు ఆపివేసి, ఇంట్లోనే ఉండాలని కొన్ని ప్రాంతాల్లో మసీదు లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు.
ఉధంపూర్, నగ్రోటా మరియు కుప్వారాలో కూడా డ్రోన్ యాక్టివిటీస్, షెల్లింగ్ జరిగినట్లు తేలింది. జమ్మూలోని సుచేత్‌గఢ్, రామ్‌గఢ్, సాంబా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దులో కాల్పుల మోత సాగింది. భారత సైనిక వైమానిక స్థావరాలు ధ్వంసం చేయడానికి యత్నించి విఫలమైన పాకిస్థాన్ ఆన్‌లైన్ వ్యవస్థలను సైబర్ దాడులతో లక్ష్యంగా చేసుకుంటోంది. అంతే కాకుండా భారత్‌పై తప్పుడు ఆరోపణలతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది.
పాకిస్తాన్ అణు సంస్థ సమావేశం
భారత్ దాడులతో భీతిల్లిపోయిన పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో అణ్వాయుధ సామగ్రిని పర్యవేక్షించే బాధ్యత కలిగిన జాతీయ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాని సైనిక చర్య తర్వాత వెంటనే అత్యవసర సమావేశం జరిగిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.





















