Heavy Rains: ఆ రాష్ట్రాలకు వెళ్తున్నారా, అయితే “రెడ్ అలర్ట్”
నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర భారతాన్ని కుండపోత ముంచెత్తుతోంది. 7 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
India Meteorological department Red alert: భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన జారీ చేసింది. ఉత్తర భారత దేశాన్ని (North India) ముంచెత్తుతున్న భారీ వర్షాలపై (Heavy Rains) ప్రజలను అప్రమత్తం చేసింది. ఏకంగా.. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ (IMD Red alert) జారీ చేసింది. మరికొన్ని రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని.. అక్కడి ప్రాంతాల ప్రజలు రాకపోకలపై ఆలోచించుకోవాలని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఐఎండీ విజ్ఞప్తి చేసింది.
ఐఎండీ జారీ చేసిన రాష్ట్రాలు ఏంటంటే.. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాలుగా సహాయక చర్యలు చేపడుతున్నా.. ఎక్కడో ఓ చోట వరదల కారణంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ ఏడు రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకూ కొనసాగుతాయని.. భారత వాతావరణ శాఖ.. తన రెడ్ అలర్ట్ లో స్పష్టంగా తెలిపింది.
రుతుపవనాల కదలికలపైనా వాతావరణ శాఖ కీలకమైన విషయాన్ని వెల్లడించింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయువ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల కదలికలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రభావం తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, బిహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను తాకుతూ.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో.. రానున్న 3 రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కరీం నగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో వైపు.. నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లలో కురిసిన భారీ వర్షానికి.. మట్టి మిద్దె కూలి ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలతో పాటు తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రికి తీవ్ర గాయాలు కాగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ లోనూ వర్షాలు జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. సడన్ గా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలు.. ప్రజలను ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నాయి.