సముద్రంలో ఒకేసారి రెండు తుపాన్లు, 2018 తరవాత మళ్లీ ఇప్పుడే!
Two Storms: భారత్‌లో ఒకేసారి రెండు తుపాన్లు పుట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
Two Storms in India:
రెండు తుపాన్లు..
అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో ఒకేసారి రెండు తుపాన్లు పుట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018 లో ఇలాగే రెండు తుపాన్లు వచ్చాయని, ఆ తరవాత ఇప్పుడు అది రిపీట్ అవుతుందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో తేజ్ సైక్లోన్ (Tej Cyclone),బంగాళాఖాతంలో హమూన్ తుపాను (Hamoon Cyclone) తొలి దశలో ఉన్నాయని తెలిపారు. నైరుతి అరేబియా సముద్రంలో తుపాను తీవ్రతరమవుతుందని అక్టోబర్ 22 నాటికి ఇది మరింత ఉద్ధృతంగా మారుతుందని వెల్లడించారు. అక్కడి నుంచి ఒమన్‌కి, యెమెన్‌కీ ఈ తుపాను విస్తరించే అవకాశాలున్నాయి. India Meteorological Department ఇప్పటికే ఈ విషయం వెల్లడించింది. ఇదే సమయంలో అటు బంగాళాఖాతంలోనూ హమూన్ తుపాన్ బలపడి క్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లోకి విస్తరించనుంది. అమరావతిలోని IMD కూడా హెచ్చరించింది. బంగాళాఖాతానికి నైరుతి దిశలో ఉన్న ప్రాంతాల్లో ప్రభావం కనిపించే అవకాశముందని అప్రమత్తం చేసింది. అక్టోబర్ 23 నాటికి ఇది బలపడుతుందని అంచనా వేసింది. దీనికే హమూన్ అనే పేరు పెట్టనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 24 నాటికి తీవ్రరూపం దాల్చుతుందని ప్రైవేట్ వెదర్‌కాస్ట్ సర్వీస్ Skymet స్పష్టం చేసింది. ఈ రెండు తుపాన్లూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. ఈ తుపాను కారణంగా చెన్నైతో పాటు తమిళనాడులోని తీర ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తమిళనాడుతోపాటు కేరళలోనూ ఈ ప్రభావం కనిపించనుంది. హిందూ మహా సముద్రంలోని తుపాన్లకు పేర్లు పెట్టే విధానాన్నే అనుసరించి ఈ రెండు తుపాన్లకూ పేర్లు పెట్టారు.