ముస్లింలంతా ఒకప్పుడు హిందువులే, మన మూలాలు హిందూ మతంలోనే - గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad: ఇస్లాం మతం కన్నా హిందూ మతం చాలా పురాతనమైందని గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Ghulam Nabi Azad:
ఆజాద్ సంచలన వ్యాఖ్యలు..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పౌరులంతా ముందు హిందువులే అని, ఆ తరవాతే ఆ మతం నుంచి వేరే మతాలకు మారారని అని అన్నారు. హిందూ మతం...ఇస్లాం మతం కన్నా పురాతనమైందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొడ జిల్లాలోని ఓ మీటింగ్‌కి హాజరైన ఆజాద్...ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం 15 వందల ఏళ్ల క్రితం వచ్చిందని, అంతకు ముందు నుంచే హిందూ మతం ఉందని తెలిపారు. ఇదే సమయంలో కశ్మీరీ పండిట్‌ల గురించీ ప్రస్తావించారు.
"15 వందల ఏళ్ల క్రితం ఇస్లాం మతం వెలుగులోకి వచ్చింది. కానీ హిందూ మతం మాత్రం అంతకు ముందు నుంచే ఉంది. కొందరు ముస్లింలు వలస వెళ్లారు. మొఘల్ సైన్యంలో చేరారు. క్రమంగా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయే వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతర్గతంగానే ఈ మత మార్పిడి తీవ్రస్థాయిలో జరిగిందిఠ
- గులాం నబీ ఆజాద్, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్
ఈ క్రమంలోని మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆజాద్. కశ్మీరీ పండిట్‌ల గురించి మాట్లాడుతూ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారని చెప్పారు. ఆ కారణంగానే...ఇప్పుడు కశ్మీర్‌లో పండిట్‌ల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించారు.
"కశ్మీర్‌ని ఓ సారి పరిశీలించండి. 600 ఏళ్ల క్రితం ఇక్కడ కశ్మీరీ పండిట్‌లదే అధిక జనాభా. కానీ వాళ్లు క్రమంగా ఇస్లాం మతంలోకి మారారు. వీళ్లందరి మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయని అర్థమవుతోంది. హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు...ఇలా పేరుకి వేరువేరుగా ఉన్నా అందరి మూలాలు ఒక్కటే. మన పూర్వీకులంతా ఇక్కడే ఉన్నారు. మొఘల్ ఆర్మీ 10-12 మందితో ఇక్కడికి వచ్చింది. ఆ తరవాతే మత మార్పిడి పెద్ద ఎత్తున జరిగింది. ఇదే విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను."
- గులాం నబీ ఆజాద్, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్
కాంగ్రెస్ వీడి..కొత్త పార్టీ..
గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్...ఆ తరవాత Democratic Azad Party స్థాపించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పని చేసిన ఆయన ఉన్నట్టుండి ఆ పార్టీని విడిచి పెట్టి బయటకు రావడం సంచలనమైంది. జమ్ముకశ్మీర్‌కి ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు ఆజాద్. ఈయన వచ్చే సమయానికే చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ విడిచి పెట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు ఈ వలసలు పెరిగాయి. ఫలితంగా..కాంగ్రెస్‌కి సవాలు ఎదురైంది. రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు గులాం నబీ ఆజాద్. సీనియర్ నేతల్ని పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీపైనా విమర్శలు చేశారు.
Also Read: 15 భాషల్లో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు, కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి