Assembly Election Results 2024:హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే సీఎంలు ఎవరు?
Haryana and J&K Poll: ఫలితాలు వెల్లడైన తర్వాత హర్యానా, జమ్మూ-కశ్మీర్‌లో ప్రమాణం చేసే సీఎంలు ఎవరనే చర్చ నడుస్తోంది. రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులపై క్లారిటీ ఉన్నప్పటికీ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
Haryana and Jammu-Kashmir Assembly Election Results 2024: హర్యానా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ మిగిల్చాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వంలో భాగస్వామి అవుతున్న అక్కడ కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు కానీ, సీట్లు కానీ అంత చెప్పుకోదగ్గ రిజల్ట్ అయితే కాదు. అందుకే కాంగ్రెస్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయింది. మంచి ఫలితాలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్‌కు ఇలాంటి ఫలితాలు మింగుడు పడటం లేదు. హర్యానాలో కచ్చితంగా కొట్టేస్తున్నామని అనుకున్నటైంలో వెనకబడి పోవడం ఆ పార్టీని మరింతగా డిఫెన్స్‌లోకి నెట్టింది.
హర్యానాలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ వాస్తవ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. మొదట్లో కాంగ్రెస్ 60కిపైగా స్థానాలు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో కూడా సంబరాలు షురూ అయ్యాయి. పది గంటల తర్వాత ఫలితాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ పైచేయి సాధించి హర్యానాలో రికార్డు విజయంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
జమ్మూ కశ్మీర్ విషయాన్ని చూస్తే... కాంగ్రెస్, ఎన్పీ కలిసి అధికారంలోకి వస్తున్నప్పటికీ బీజేపీ గట్టిపోరాటాన్నే ఇచ్చింది. ఓటింగ్ శాతం చూసుకుంటే మాత్రం బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాత స్థానంలో ఎన్సీ ఉంది. కాంగ్రెస్‌కు నాల్గో స్థానం దక్కింది.
హర్యానాలో ఈసారి చాలా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. 9 మంది మంత్రులు, హర్యానా స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు. కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే గట్టెక్కారు. 2019 ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ ఈసారి ఖాతా కూడా తెరవలేదు.
ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి?
హర్యానాలో భారతీయ జనతా పార్టీకి 39.94 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 39.09 శాతం ఓట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని 55 లక్షల 48 వేల 800 మందికిపైగా బీజేపీ ఓటు వేశారు. 54 లక్షల 30 వేల 600 మందికిపైగా ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రెండు పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్లలో 1 లక్షా 18 వేల ఓట్లు తేడా ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. కేవలం 1.79 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇండియన్ నేషనల్‌లోక్ దళ్‌తో పొత్తుతో ఎన్నికల్లో బరిలోకి దిగిన బీఎస్పీకి 1.82 శాతం ఓట్లు వచ్చాయి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కు 4.14 శాతం వస్తే, జేజేపీకి 0.90 శాతం, నోటాకు 0.38 శాతం, స్వతంత్రులకు 11.64 శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికలు జేజేపీకి పీడకలగా చెప్పుకోవచ్చు. మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా కూడా ఓడిపోయారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలను పది పాయింట్లలో చూద్దాం.
- హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్‌ఎల్‌డీ 2, ఇతరులు 3 గెలుచుకున్నారు.
- జమ్మూ కాశ్మీర్‌లో కూడా 90 అసెంబ్లీ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి 49 సీట్లు గెలుచుకుంటే బీజేపీకి 29, పీడీపీకి 3, ఇతరులు 9 సీట్లు కైవశం చేసుకున్నారు.
- విజయం తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర పాలిత ప్రాంతానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కూటమికి ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించిన మీడియాకు ఇలా సమాధానం చెప్పారు.
- జమ్మూకశ్మీర్‌లో సీఎం ఎవరనేది దాదాపు క్లియర్‌గా ఉంది. కానీ హర్యానాలో మాత్రం డిస్కషన్ జరుగుతోంది. సోర్స్ ప్రకారం నయాబ్ సింగ్ సైనీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తనకు అవకాశం ఇస్తే హర్యానా రూపురేఖలే మార్చేస్తానంటూ అనిల్ విజ్ చెబుతున్నారు. తనకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. తనకు కాకుండా ఎవరికి ఇచ్చినా సహకరిస్తానంటూ చెప్పుకొచ్చారు.
- జమ్మూకశ్మీర్ ఫలితాల్లో మెహబూబా ముఫ్తీ పార్టీ చాలా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. పీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది.
- జమ్మూకశ్మీర్ ఫలితాల్లో మెహ్రాజ్ మాలిక్ పేరు చాలా ఫేమస్ అయిపోయారు. దోడా సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై మెహ్‌రాజ్ మాలిక్ విజయం సాధించారు.
- జులానాలో నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వినేష్ బీజేపీకి చెందిన యోగేష్ కుమార్‌పై 6,553 ఓట్లతో విజయం సాధించారు.
- హర్యానాలో బీజేపీ విజయానికి నయాబ్ సింగ్ సైనీ పాత్ర ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యాక తన మార్కు పాలనతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని అంటున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఫోకస్డ్‌గా పని చేశారని విశ్లేషిస్తున్నారు.
- జమ్మూకశ్మీర్‌లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అభినందించారు. ఆమె మాట్లాడుతూ, 'అద్భుతమైన పనితీరుతో విజయం సాధించిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను. సుస్థిర ప్రభుత్వం కోసం ఓటు వేసినందుకు జమ్మూకశ్మీర్ ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను. అని అన్నారు.
- బుద్గాం, గందర్‌బల్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని నాశనం చేయాలనుకున్నవాళ్లు నాశనం అయ్యారని అన్నారు.