Dussehra Celebrations 2024: దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగే గుజరాతీ దసరా "గర్బా"
Gujarat Dussehra : దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగుతుంది గుజరాతీ దసరా. మట్టి లాంతర్ల చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చేసే దాండియా నృత్యాలే "గర్బా"గా చెబుతారు. జీవిత తాత్వన్ని బోధిస్తాయి.
Gujarat Dussehra 2024: దేశంలో జరిగే ముఖ్యమైన దసరాల్లో గుజరాతి దసరా ఒకటి. ఈ దసరాను "గర్బా" అని పిలుస్తుంటారు. వీటిని చూడడానికి దేశం నలుమూలల నుంచి టూరిస్టులు అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు.
దాండియా డాన్సులే ప్రధాన ఆకర్షణ
గుజరాతి దసరా " గర్బా" అనే పదం" గర్భ" అనే సంస్కృత పదం నుంచి పుట్టింది అంటారు. అమ్మ గర్భం నుంచి పుట్టింది మొదలు జీవితం, మరణం, పునర్జన్మ ఇలా లైఫ్ సైకిల్‌ను తలపిస్తూ చేసే నృత్యమే "దాండియా ". మైదానం మధ్యలో మట్టితో తయారు చేసిన లాంతరు వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ కలర్‌ఫుల్‌గా ఉండే చెక్క కర్రలను లయబద్ధంగా కొడుతూ చేసే డాన్స్‌నే "దాండియా" అంటారు.
"దాండియా " అనేది బాగా పాపులర్. గతంలో అమ్మవారికి చిహ్నంగా మట్టి దీపాన్ని ఉంచేవారు. కానీ కొన్నేళ్లుగా మట్టిలాంతరతోపాటు దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాండియా ఆడుతున్నారు. దసరాలోని తొమ్మిది రోజులు కూడా ఈ దాండియా కొనసాగుతుంది. మొదట్లో "గర్బా"లో ఆడవాళ్లు మాత్రమే నృత్యాలు చేసేవారట. దీనికోసం ప్రత్యేకంగా " గాగ్రా చోళీ" అనే డ్రెస్ డిజైన్ చేసేవారు.
"దాండియా రాస్ " అనే మరో సాంప్రదాయ నృత్యాన్ని కేవలం మగవాళ్ళు మాత్రమే చేసేవారు. కొన్ని దశాబ్దాలుగా రెండు కలిసిపోయి దాండియాగా "గర్బా " పండుగ సమయంలో చేస్తున్నారు. "గాగ్రా చోళీ " కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ డ్రెస్ డిజైన్‌గా మారిపోయింది.
"గర్బా " పండుగ సమయంలో తొమ్మిది రాత్రులు 9 దుర్గాదేవి అవతారాలను పూజిస్తూ దాండియా కొనసాగుతుంది. ఈ దాండియా అనేది గుజరాత్‌లోని వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పద్ధతుల్లో చేస్తారు. ఈ సమయంలో మహిళలు ధరించే "గాగ్రా చోళీ"ని "చాన్య చోళీ" అని కూడా పిలుస్తారు. ఎరుపు, పసుపు, పింక్, ఆరెంజ్ లాంటి బ్రైట్ కలర్స్‌తో తయారైన డ్రెస్‌లే ఎక్కువగా ధరిస్తారు. వీటికి అతికించి ఉండే చిన్న చిన్న అద్దాలు గాగ్రా చోళీకి మరో అట్రాక్షన్.
2023 డిసెంబర్‌లో యునెస్కో ఈ "గర్భా"ను " మార్పు చేయలేని సంస్కృతిక వారసత్వం" (ICH )గా ప్రకటించింది. ప్రస్తుతం "గర్బా" "దాండియా రాస్ " అమెరికా, UK, కెనడాల్లో కూడా పాపులర్ అయ్యాయి. ఆయా దేశాల్లో స్థిరపడిన గుజరాతీలు వీటికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు.
శక్తి పీఠాల సందర్శన
గుజరాతి ప్రజలు దసరా సందర్భంగా తమకు దగ్గరలోని శక్తిపీఠాలు అంబాజీ, పావగడ్, బహుచ్రజిని దర్శిస్తారు. కచ్‌లోని ఆశపురమాత, భావ నగర్‌లోని ఖోడియర్ మందిర్, చోటిలాలోని చముండా మాత మందిర్‌లలో ప్రత్యేక పూజలు చేస్తారు.
దసరా వంటకాలు మరో స్పెషాలిటీ
గుజరాతి దసరాలో అక్కడి స్పెషల్ వంటకం డోక్లాతోపాటు మరిన్ని వెరైటీస్ చేస్తారు. బాదం కుకీలు, జీరా బిస్కెట్లు, ఆలూ భుజియా, చేవడ మిక్స్‌లతో పాటు బోలెడన్ని వెరైటీల పరోటాలు టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి.
ప్రధాని సొంత రాష్ట్రంలో ఘనంగా జరిగే దసరా
మోదీ ప్రధాని అయ్యాక "గర్బా" పండుగకు దేశవ్యాప్తంగానూ పాపులారిటీ మరింతగా పెరిగింది. అహ్మదాబాద్‌తోపాటు గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల్లో "గర్బా"తో పాటు ఇప్పుడు రామ్- లీలా, రావణ దహన్ లాంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.