G20 Summit First Day Schedule: ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు పూర్తి షెడ్యూల్ - మొదటి రోజు జరిగే కార్యక్రమాలు ఇవే
ఢిల్లీలో జీ20 సమావేశాలకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అయితే.. ఈ సమావేశాల్లో తొలిరోజు ఈవెంట్స్ ఏంటి? ఏఏ కార్యక్రమాలు జరగబోతాయి? పూర్తి షెడ్యూల్ చూద్దాం.
ఢిల్లీలో రేపటి నుంచి జీ20 శిఖరాగ్ర సదస్సు జరగుంది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు 40కి పైగా దేశాధినేతలు హాజరవుతున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని భారత మండపం వేదికగా సమావేశాలు జరగబోతున్నాయి. శక్తివంతమైన ప్రపంచ నాయకుల బృందానికి భారతదేశం ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, UK ప్రధాన మంత్రి రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా వివిధ దేశాల అధ్యక్షులు ఈ సమావేశాలకు వస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. రేపు ప్రారంభం కానున్న జీ20 సమావేశాల షెడ్యూల్ ఏంటి..? ఏ టైమ్‌కి ఏ కార్యక్రమం జరుగుతుంది..? పూర్తి షెడ్యూల్ ఒకసారి చూసేద్దామా.
రేపు ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో భారత మండపానికి దేశాధినేతల వస్తారు. భారత మండపంలోని లెవెల్-2లో ట్రీ ఆఫ్ లైఫ్ ఫోయర్ దగ్గర దేశాధినేతలతో ప్రధాని ఫొటో సెషన్ ఉంటుంది. లెవెల్-2లోని లీడర్స్ లాంజ్‌లో దేశాధినేతలు కలుస్తారు. ఇక, ఉదయం 10:30 నుంచి 13.30 వరకు.. జీ20 సదస్సులో మొదటి సెషన్ జరుగుతుంది. భారత మండపంలోని లెవెల్-2 సమ్మిట్ హాల్‌లో ఒకే భూమి అంశంపై చర్చిస్తారు. దాదాపు మూడు గంటల పాటు ఈ చర్చ కొనసాగుఉతంది. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.
తిరిగి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి భారత మండపం లెవెల్-1లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 నుంచి మూడు గంటల వరకు ఈ చర్చలు సాగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు జీ20 సదస్సులో రెండవ సెషన్ ప్రారంభమవుతుంది. భారత మండలం లెవెల్-2లోని సమ్మిట్ హాల్‌లో ఒకే కుటుంబం అంశంపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 4గంటల 45 నిమిషాల వరకు ఈ చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత... దేశాధినేతలు, వీవీఐపీలు... వారికి కేటాయించిన హోటళ్లకు తిరిగి వెళ్తారు.
రాత్రి విందు
ఇక, రాత్రి 7గంటల నుంచి 8గంటల వరకు డిన్నర్ కోసం దేశాధినేతలంతా చేరుకుంటారు. విందు కార్యక్రమానికి ముందు ఫొటో సెషన్ కూడా ఉంటుంది. రాత్రి 8గంటల నుంచి 9గంటల 15 నిమిషాల వరకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో కలిసిన అతిథులంతా ఒకరినొకరు పలకరించుకుని సంభాషించుకుంటున్నారు. విందు కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 9గంటల 10 నిమిషాల నుంచి 10గంటల 45 నిమిషాల వరకు... భారత మండపం లెవెల్-2లోని లీడర్స్ లాంజ్‌లో దేశాధినేతలు, ప్రతినిధులు అంతా ఒక చోట చేరతారు. ఆ తర్వాత.. సౌత్, వెస్ట్ ప్లాజాల నుంచి వారి వారి హోటళ్లకు తిరుగు ప్రయాణమవుతారు.