G20 Summit 2023: అంతా ఓకే, కానీ ఆ పనులు మాత్రం చేయకండి - మంత్రులకు పీఎం మోదీ క్లాస్
PM Modi dos and donts for ministers for G20: జీ 20 సదస్సును భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు.
PM Narendra Modi: జీ 20 సదస్సును భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విదేశీ అతిథులకు రెండు రోజులపాటు చిన్న లోటు కూడా రాకుండా చూసుకోవాలని సూచించారు. మంత్రులంతా తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టాలని ఆదేశించారు. ఎక్కువ మంది వీఐపీ వాహనాల్లో తిరిగితే ప్రోటోకాల్ సమస్యలు రావొచ్చన్నారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రులు సొంత వాహనాల్లో పార్లమెంట్ కాంప్లెక్స్ వరకే రావాలన్నారు. అక్కడి నుంచి ‘భారత్ మండపం’, ఇతర వేదికల వద్దకు చేరుకోవడానికి షటిల్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. విదేశీ ప్రతినిధులను వారి సంప్రదాయాల ప్రకారం పరిచయం చేసుకోవాలని సూచించారు. వారి జీవన విధానం, ఆహారం, సంస్కృతులు, ఇతర ప్రాథమిక అంశాలపైన మంత్రులు అవగాహన పెంచుకోవాన్నారు. అధికారికంగా ప్రకటించిన వారు తప్ప జీ 20 సదస్ససు గురించి ఏ మంత్రి మాట్లాడకూడదని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రులు జీ 20 ఇండియా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని సూచించారు. ఈ యాప్‌లో అన్ని భారతీయ భాషలు, జీ-20 దేశాల తక్షణ అనువాద ఫీచర్‌ను పొందుపరిచారు. విదేశీ ప్రముఖులతో మాట్లాడే సమయంలో అందులోని ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇతర ఫీచర్లు సైతం జీ-20 సదస్సు నడిచే తీరుతెన్నులు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటాయని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు.
విందు విషయంలో మంత్రులకు ప్రధాని సలహా
విందుకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి కూడా తన అనుచరగణంతో పార్లమెంటు భవన సముదాయానికి చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో వెళ్తారు. విందు కోసం మంత్రులు, ముఖ్యమంత్రులు సాయంత్రం 5:50 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు చేరుకుని 6:30 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మంది ముఖ్య నేతలు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ సంబంధిత విషయాలను విదేశాంగశాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా మంత్రులకు వివరించారు. కొందరు మంత్రులకు విదేశీ ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా మంగళవారం ఢిల్లీ విచ్చేసిన నైజీరియా అధ్యక్షుడు బోల అహ్మద్ టినుబుకు కేంద్రమంత్రి ఎస్పీఎస్ సింగ్ బగేల్ స్వాగతం పలికారు.
9న రాష్ట్రపతి విందు
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పాటు చేయనున్నారు. జీ-20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ప్రధాన రోడ్లు, కూడళ్లు, అతిథులు తిరిగే రోడ్లను ముస్తాబు చేశారు.
ఢిల్లీ ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.