సిమీపై ఐదేళ్ల నిషేధం.. సిమీ అంటే ఏమిటి? నిషేధం ఎందుకు? ఎన్నికలకు ముందు ప్రభావం ఎంత?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏపీఏ కింద ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా పేర్కొంటూ.. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది.
Five years ban on SIMI: కేంద్రంలోని నరేంద్ర మోడీ(PM Narendra modi) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏపీఏ(UAPA) కింద ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా పేర్కొంటూ.. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. దీంతో మరోసారి SIMI వ్యవహారం తెరమీదకు వచ్చింది. దేశంలో ఉగ్రమూకల కార్యకలాపాల గురించి అందరికీ తెలిసిందే. అయితే.. ఎక్కడి నుంచో.. వచ్చి భారత్‌లో దాడులు చేసే సంస్థలు జైష్ ఏ మహ్మద్ వంటివి తెలుసు. కానీ, మన దేశంలోనే పుట్టి.. పౌరులపై దాడులు చేయడం, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే అజెండాను ఎంచుకోవడం SIMI లక్ష్యం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అనేక దాడులు, మారణాలకు SIMI ఒడిగట్టింది. చిత్రం ఏంటంటే.. నిషేధం విధించిన తర్వాత కూడా SIMI దేశంలో దాడులకు తెగబడింది.
అజెండా ఏంటి?
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI) సంస్థను 1977, ఏప్రిల్ 25న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేసి.. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే. అదే అజెండాతో ఉద్భవించిన SIMI తన పంతాన్ని నెగ్గించుకునేందుకు సాయుధ పోరుకు తెగబడింది. ఈ సంస్థ నాయకుడు ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ. ప్రస్తుతం ఈయన పరారీలో ఉన్నాడు. అయినప్పటికీ.. ఆన్‌లైన్ వేదికలను ఆసరా చేసుకుని దేశంలో ముస్లిం యువతను రెచ్చగొట్టడం, జీహాదీలకు ప్రోత్సహించడం వంటివి ఈయన నిత్యకృత్యాలుగా కేంద్రం చెబుతోంది. అంతేకాదు, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సైతం వెల్లడించింది.
దారుణాలు ఇవీ..
+ 2014లో భోపాల్ జైల్ బ్రేక్
+ 2014లో బెంగళూరులోని ప్రముఖ చిన్నస్వామి స్టేడియంలో పేలుళ్లు
+ 2017లో గయలో పేలుళ్లు
+ దేశంలో అనేక చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో సిమి సభ్యుల ప్రమేయం
ఎందుకీ నిషేధం?
ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదన్న భారత దేశ దృక్పథాన్ని బలపరుస్తూ.. యూఏపీఏ(ఉపా చట్టం) కింద ‘SIMI`పై నిషేధం విధించారు. తొలుత 2001లో అప్పటి వాజపేయి(Vajapayee) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించే సంస్థలను ఉపేక్షించేది లేదని పార్లమెంటులోనే ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని పెంచి, శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించడంలో సిమి సంస్థ ప్రమేయం ఉన్నట్లు నిర్దారించామని పేర్కొంటూ.. తొలిసారి నిషేధం విధించారు. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని హోం మంత్రిత్వ శాఖ ఎనిమిదిసార్లు పొడిగిస్తూ వచ్చింది.
తాజాగా..
SIMIపై తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదోసారి కూడా నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించినట్టు తెలిపింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం.. శాంతి(Peace), మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉన్నట్లు తేలిందని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. 2014 ఫిబ్రవరి 1 నుంచి SIMIపై మోడీ సర్కారు మరింత తీవ్రంగా ఆంక్షలు విధించడం గమనార్హం. తరచుగా నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు కూడా చేస్తున్నారు.
ఏమిటీ.. UAPA
UAPA అంటే.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం. దేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి ఉద్దేశించిన కీలకమైన చట్టం. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలు, వ్యక్తులను ఈ చట్టం కింద ఎలాంటి ముందస్తు విచారణ లేకుండానే అదుపులోకి తీసుకునే ప్రత్యేక అధికారులు ఈ చట్టం కింద దఖలుపడతాయి. దీనిని గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకురాగా, ఇటీవల మోడీ ప్రభుత్వం మరింత సవరించి.. ఇంకా కఠినతరం చేసింది. UAPA-2019 సవరణ చట్టం.. ఎటువంటి అధికారిక న్యాయ ప్రక్రియను అనుసరించకుండా వ్యక్తులను తీవ్రవాదులుగా గుర్తించడాన్ని అనుమతిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమని.. ప్రతిపక్షాలు చాలా రోజులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు ప్రభావం?
మరికొద్ది వారాల్లోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో SIMIపై మరో ఐదేళ్లు నిషేధం విధించడం.. ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రధాని మోడీ(PM Narendra Modi హయాంలో సరిహద్దుల వద్ద తప్ప దేశంలో పెద్దగా ఎలాంటి ఉగ్ర ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే.. చైనా.. పాకిస్థాన్‌తో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా వివాదాలు ఎలా ఉన్నా.. తాజాగా నిర్ణయంతో అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తున్నామనే సంకేతాలు పంపించినట్టు అయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇది ఎంతో కొంత లాభిస్తుందని అంటున్నారు.