Delhi Teacher: హిందీ పుస్తకం తీసుకురాలేదని కొట్టిన టీచర్, విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స
Delhi Teacher: హిందీ పుస్తకం తీసుకురాలేదని టీచర్ కొట్టడంతో అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Delhi Teacher: ఢిల్లీలో ప్రభుత్వ టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఆస్పత్రిపాలయ్యాడు. హిందీ పుస్తకం తీసుకురాలేదన్న కోపంతో తీవ్రంగా కొట్టడంతో కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఢిల్లీలోని దయాల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 11 ఏళ్ల అర్బాజ్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతడు ఎప్పట్లాగే స్కూల్ కు వెళ్లాడు. అయితే అతను హిందీ పుస్తకాన్ని తీసుకెళ్లడం మర్చిపోయాడు. తన వద్ద హిందీ పుస్తకం లేదని గుర్తించిన టీచర్.. అర్బాజ్ ను గదమాయించి అడిగాడు. దానికి బిక్కమొహం వేసిన అర్బాజ్.. తన వద్ద హిందీ పుస్తకం లేదని, ఇంటి వద్దే మర్చిపోయినట్లు చెప్పాడు. దాంతో కోపోద్రిక్తుడైన టీచర్.. అర్బాజ్ ను తీవ్రంగా కొట్టాడు. అలాగే విద్యార్థి మెడను కోసినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. టీచర్ దెబ్బలకు తాళలేకపోయాడు అర్బాజ్. తీవ్ర గాయాలతో సొమ్మసిల్లిన అర్బాజ్ ప్రస్తుతం గురు తేగ్ బహదూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడి పరిస్థితి మరింతగా దిగజారిందని, కనీసం పోలీసులు స్టేట్ మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదని అర్బాజ్ తండ్రి మహ్మద్ రంజానీ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బొట్టు పెట్టుకున్నాడని కొట్టిన టీచర్
ఝార్ఖండ్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. టీచర్ చెంపదెబ్బ కొట్టిందన్న అవమానంతో ప్రాణాలు తీసుకుంది. బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు టీచర్ విద్యార్థినిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి నుంచి సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. టీచర్ టార్చర్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో రాసింది విద్యార్థిని. "ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. ఆమె దగ్గర ఓ సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నాం. స్కూల్‌లో టీచర్ వేధించడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసింది. ఈ నోట్ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశాం. తదుపరి విచారణ కొనసాగిస్తాం" అని పోలీసులు తెలిపారు.
Also Read: బజ్‌రంగ్ దళ్‌లోనూ మంచి వాళ్లుంటారు, బ్యాన్ చేసే ఆలోచన లేదు - దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్ ఐఐటీలోనూ విద్యార్థిని సూసైడ్
ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాసి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత నాయక్(21) ఎంటెక్ చదువుతుంది. మంగళవారం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపింపించింది. ఒరియా భాషలో తన చావుకు ఎవరూ కాదని, చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నట్లు సూసైడ్ లెటర్ రాసి బలవణ్మరణానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ .. మమైత ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు వారాల క్రితమే విద్యార్థి క్యాంపస్‌లో చేరిందని, జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.